భారతీయ వెండితెరపై కొన్నేళ్లుగా బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఆ కోవలోనే ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్స్‌లో ఒకడిగా పేరొందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా తాజాగా తెరకెక్కింది. అయితే భారత్‌లో క్రికెట్ క్రీడకు విపరీతమైన ఆదరణ వచ్చేందుకు కారణమైన 1983 క్రికెట్ వరల్డ్ కప్ లో కపిల్ డెవిల్స్ గెలుపునే ఈ చిత్రంలో ప్రధాన అంశంగా తీసుకోవడంతో ఇది పూర్తిగా కపిల్ జీవిత కథ అని చెప్పలేం. రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విడుదలై మంచి విజయం దిశగా వెళుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర నిర్మాత ఇందూరి విష్ణువర్ధన్ తెలుగువారేనన్నది చాలా తక్కువ మందికే తెలుసు. విజయవాడకు చెందిన విష్ణువర్ధన్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు చాలానే శ్రమించాల్సి వచ్చిందట. ఇక విష్ణువర్ధన్ జీవితంలోనూ ఎదురైన ఎత్తుపల్లాలు, సాధించిన విజయాలు, అధిగమించిన ఇబ్బందులు తెలుసుకుంటే అది కూడా భవిష్యత్తులో ఎవరైనా బయోపిక్ తీయదగ్గ కథేననిపించడం ఖాయం.
కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుండగానే మిస్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత విష్ణువర్ధన్‌ది. ఆ తర్వాత ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లిన అతడు దాన్ని మధ్యలోనే వదిలేసి కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడంలో పడ్డారు. ఆ సమయంలో అతడు ఏర్పాటు చేసిందే భారత స్టూడెంట్ డాట్ కామ్. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులకు అక్కడి కాలేజీల్లో సీట్ల వివరాలు, అక్కడ లభించే పార్ట్ టైమ్ ఉద్యోగాలు, వసతులు గురించి తెలియజేసే సంస్థ ఇది. కొంతకాలం తరువాత దీన్ని లాభానికి అమ్మేసి, టీవీ రంగంలోకి అడుగుపెట్టి గోల్డ్ రష్- నీ ఇల్లు బంగారం కానూ మాయాబజార్ వంటి విజయవంతమైన కార్యక్రమాలను రూపొందించారు. ఆ తర్వాత మా అసోసియేషన్ ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించడంలోనూ ప్రధాన పాత్ర విష్ణువర్ధన్‌దే. ఈ కార్యక్రమాల ద్వారా ఏర్పడిన సినీ పరిచయాలతోనే ఆ తర్వాత ఐపీఎల్ తరహాలో సీసీఎల్ ను ఏర్పాటు చేసి విజయవంతమయ్యారు. అనంతరం దక్షిణాది సినీ ప్రతిభను అంతర్జాతీయంగా చాటిచెప్పేందుకు ఉపయోగపడే వేదికగా సైమా అవార్డుల కార్యక్రమం మొదలుపెట్టిందీ ఈయనే. ఆ తరువాత సినీ రంగంలో నిర్మాతగా అడుగుపెట్టి ఎన్టీఆర్, జయలలితల బయోపిక్‌లను ప్రేక్షకులకు అందించారు. ఇప్పడు 83 తరువాత అజాద్ హింద్ పేరుతో పలువురు దేశభక్తుల జీవితగాథలను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు విష్ణువర్థన్.