భారతీయ వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా దశాబ్ద కాలం పైగా వెలుగొందిన మాధురీ దీక్షిత్ అంటే అప్పట్లో ఉండే క్రేజ్ ముందు ఎవరైనా దిగదుడుపేనని చెప్పాలి. అందం, అభినయం, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ ఇవన్నీ కలబోస్తే మాధురీ దీక్షిత్. అందుకే సామాన్య ప్రేక్షకుల్లో మాత్రమే కాదు.. తమ తమ రంగాల్లో విజయవంతమై ప్రజల్లో పేరు ప్రఖ్యాతి పొందిన ప్రముఖులకు కూడా మాధురి అంటే ప్రత్యేకమైన అభిమానం. ఓరకంగా ఆమె అప్పట్లో ఎందరికో కలల రాణి. ఆమెపై అభిమానానికి వయసుతో కూడా సంబంధం లేదనడానికి సుప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మాధురిపై పెంచుకున్నఅభిమానమే తార్కాణం. అప్పట్లో ఆయన ఈ విషయాన్ని ఎన్నోసార్లు స్వయంగా చెప్పేవారు కూడా. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మేటి నటి శ్రీదేవి హవా కొనసాగుతున్న కాలంలో మెరుపుతీగలా వెండితెరపైకి దూసుకొచ్చిన ఈ హీరోయిన్ ఆ తరువాత కొంతకాలానికే శ్రీదేవి స్థానాన్ని అలవోకగా ఆక్రమించింది. ఆ తరువాత దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు బాలీవుడ్ తెరను తిరుగులేని స్థాయిలో ఏలేసింది.
ఇక ఆమెపై విపరీతమైన అభిమానం పెంచుకున్నవారిలో ఎంఎఫ్ హుస్సేన్ మాత్రమే కాదు. ఇంకా చాలామంది ప్రముఖులే ఉన్నారు. వారిలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకునే కూడా ఉన్నారట. చాలామందికి తెలియని ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా..? ఆయన కూతురు నేటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణేనే స్వయంగా బయటపెట్టింది. మాధురి, దీపికా కలిసి ఏ చిత్రంలోనూ నటించింది లేదు. కానీ గతంలో ఓ మ్యాగజైన్ కోసం వీరిద్దరూ కలిసి పని చేశారు. ఈ సందర్భంగానే ఈ ఇద్దరు భామలు తమ అభిప్రాయాలు, అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఈ సమయంలోనే దీపికా పదుకొణే.. తన సీనియర్ మాధురితో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించి ఆమెను సర్‌ప్రైజ్ చేసింది. తన తండ్రి ప్రకాష్ పదుకొణె మీకు వీరాభిమాని అంటూ దీపిక మాధురితో చెప్పింది. అంతేకాదు మాధురీ దీక్షిత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకున్న వార్త విన్నాక ప్రకాష్ పదుకొణె బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ వేసుకుని చాలాసేపు ఏడ్చేశాడట. బయటకు వచ్చాక చూస్తే అతడి కళ్లు వాచిపోయి ఉన్నాయట. ఈ విషయంపై దీపిక సహా ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆయన్నుఆట పట్టిస్తూనే ఉంటారట. ఈ విషయాలన్నీ అప్పట్లో స్వయంగా దీపిక నోటివెంట విన్న మాధురి.. దీపిక తండ్రికి తనపై ఉన్న అభిమానానికి ఆశ్చర్యానందాలు వ్యక్తం చేస్తూనే హాయిగా, అందంగా నవ్వేసింది.