శ్యామ్ సింగ రాయ్ : స్వామి భక్తి ఉన్మాదం అవుతుంది జాగ్రత్త ?
భక్తి వేరు భక్తి అవధి దాటడం వేరు
స్వామి భక్తి పేరుతో అరాచకం సృష్టించడం వేరు
ఏదేమయినప్పటికీ జగన్ భక్తులు వేరు
రాజకీయాల్లో వీరి భక్తి కోటలు దాటిపోతుంది
భజన ఎల్లలు దాటిపోతుంది
అయినా కూడా నిండా ముంచేది వీరే అని
తెలుసుకోలేక జగన్ తరుచూ ఇబ్బందుల్లో పడుతున్నారు!
ఆంధ్రావని రాజకీయాల్లో జగన్ స్థానం వేరు.. ప్రస్థానం వేరు. ఒక చిన్న పార్టీగా మొదలు పెట్టి తరువాత అలా అలా అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి జగన్. మొదట్లో ఇంతటి క్రేజ్ ఉండేది కాదు. సానుభూతి తో నెగ్గుకు వద్దామన్న తాపత్రతయం మాత్రం ఆయనలోనూ, ఆయన వర్గంలోనూ విపరీతంగా ఉండేది. తరువాత కొందరు సీనియర్లు చేరడంతో పార్టీ కాస్త బలోపేతం అయింది. అయితే తన క న్నా సీనియర్లు పార్టీని తమ చెప్పు చేతల్లో తీసుకుంటారన్న భయం ఎప్పుడూ జగన్ లో ఉండేది. దాంతో తన ఆజ్ఞ మీరి ప్రవర్తించ కూడదని జగన్ తరుచూ ఆదేశాలు ఇచ్చేవారు. అదేవిధంగా జిల్లాలలోనూ సీనియర్ నాయకుల రాక పై కొంత అసంతృప్తి ఆ రోజుల్లో ఉన్నా కూడా జగన్ తప్పని సరై ధర్మాన ప్రసాదరావు లాంటి వారిని తీసుకున్నారు. బొత్స లాంటి వారిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. తరువాత కాలంలో జగన్ నెగ్గాక కొందరు పార్టీలో చేరిపోయారు. ఆ విధంగా వైసీపీ బలోపేతం అయింది. అధికారంలోకి వచ్చాక జగన్ భజన మొదలయింది.
బొత్స, కన్నబాబులాంటి మంత్రులు భజనకు దూరంగా ఉండాలనుకునే వ్యక్తులే కానీ ఎందుకనో వీళ్లకూ ఆ పని తప్పడం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటి మంత్రులు అమితం అయిన ప్రేమతో జగన్ వైపు మాట్లాడుతున్నా అవి కూడా నమ్మకం కలిగించేలా లేవు. పార్టీలో కోవర్టులు పెరిగిపోయారని వారే స్వామి భక్తి పైకి నటించి కొంప ముంచుతున్నారని చాలా మంది కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. కానీ తాము చెప్పినా కూడా జగన్ వినిపించుకునే స్థితిలో లేదరని అంటున్నారు ఇంకొందరు.