అఖిల్ కు స్టార్‌డ‌మ్ వ‌చ్చేదెప్పుడు..?

          తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మూల స్తంభాలుగా నిలిచిన దిగ్గ‌జ న‌టులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌. వారు వెండితెర‌పై పోషించిన పాత్ర‌లు అనిత‌ర‌సాధ్యం. ఎన్టీఆర్ న‌ట‌ వార‌సత్వాన్ని బాల‌కృష్ణ అందుకుని స్టార్ హీరోగా న‌వ‌త‌రం హీరోల‌కు పోటీ ఇస్తూ ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నారు. ఆ కుటుంబం నుంచి వ‌చ్చిన త‌రువాతి త‌రం న‌టుడు తార‌క్ సైతం ఘ‌న విజ‌యాల‌తో టాలీవుడ్ టాప్‌స్టార్ల‌లో ఒక‌డిగా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. ఇక అక్కినేని న‌ట‌వార‌సుడిగా  నాగార్జున సైతం టాలీవుడ్ అగ్ర‌న‌టుల్లో ఒక‌రిగా ద‌శాబ్దాల‌పాటు తిరుగులేని స్టార్‌డ‌మ్‌తో కొన‌సాగుతూ వ‌చ్చారు. టాలీవుడ్‌ మాత్ర‌మే కాదు.. బాలీవుడ్‌లోనూ న‌టించి, అక్క‌డ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న చ‌రిత్ర‌ నాగ్‌ది. త‌న త‌రం హీరోలు మ‌రెవ‌రికీ  సాధ్యంకాని ఘ‌న‌త ఇది.  అయితే అక్కినేని మూడో త‌రం హీరోల విష‌యం వ‌చ్చేస‌రికి ఈ లెగ‌సీని ఆ స్థాయిలో  ముందుకు తీసుకువెళ్లలేక‌పోతున్నార‌నేది నిజం. ఇది అక్కినేని అభిమానుల‌కు కాస్త నిరాశ‌ క‌లిగించే విష‌య‌మే.

 
          నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య ద‌శాబ్దం క్రిత‌మే తెరంగేట్రం చేసి.. ఏం మాయ చేశావే, 100% ల‌వ్‌, మ‌జిలీ, ఇటీవ‌ల శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌వ్‌స్టోరీ వంటి చిత్రాల విజ‌యాల‌తో ప‌ర్వాలేద‌నిపించినా తండ్రి స్థాయి మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోలేక‌పోయాడు. నాగ్ రెండో త‌న‌యుడు అఖిల్‌పై ఆ కుటుంబ అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. తెరంగేట్రం చేయ‌డానికి ముందే టాలీవుడ్‌ను దాటి బాలీవుడ్ వ‌ర‌కు అఖిల్ పేరు మారుమోగింది. అయితే మొద‌టి సినిమా అఖిల్ ఈ అంచనాల‌ను తారుమారు చేసింది. డైరెక్ట‌ర్ ఈ హీరోను స‌రిగా లాంచ్ చేయ‌లేక‌పోయాడు. ఇందుకు నాగార్జున కూడా బాధ‌ప‌డే ఉండాలి. అయితే ఆ త‌రువాత అఖిల్ త‌న ప్ర‌య‌త్న లోపం లేకుండా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా విజ‌యం మాత్రం త‌న‌కు దూరంగానే ఉంటోంది. విక్రం కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ‘హలో’ అప‌జ‌యాన్నే ఇవ్వ‌గా, వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన మిస్ట‌ర్ మ‌జ్ను డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ మాత్రం కాస్త మెరుగైన టాక్ తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోగా ఎదిగేందుకు అన్నిర‌కాల అర్హ‌త‌లున్న‌ అఖిల్ స్థాయికి  ఇంకా పెద్ద స‌క్సెస్‌లే వ‌చ్చి ఉండాల్సింద‌ని, వెన‌కాల పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఉన్నా, స్టార్ కిడ్ అయినా ఈ ప‌రిస్థితి ఏంట‌ని అక్కినేని అభిమానులు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: