పీరియాడికల్ సినిమాలు, చారిత్రక పాత్రలకు సినిమాటిక్ లిబర్టీతో కాస్త ఫిక్షన్, మరికాస్త మసాలా జోడించి తీస్తున్న సినిమాలకు ఇప్పుడు జనం బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌తోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోను గడచిన కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ విజయవంతంగా నడుస్తోంది. అయితే ఇలాంటి ట్రెండ్ పదేళ్ల క్రితమే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాతో మొదలుకావాల్సి ఉందని చెపితే ఇప్పుడు చాలామంది నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం. అయితే ఈ చిత్రానికి సంబంధించి అద్భుతమైన అంచనాలతో షూటింగ్ సైతం ప్రారంభించినా అది సాకారం కాలేదు. అసలా విషయమే చాలామంది మరచిపోయారు. సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ అటు కోలీవుడ్‌కు ఇటు టాలీవుడ్‌కు సుపరిచితుడే.. స్టార్ హీరోలతో పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఎప్పుడో పదేళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా చారిత్రక కథాంశంతో ‘రానా’ చిత్రాన్ని ప్రారంభించాడు. భారీ ప్రాజెక్టుగా అప్పట్లో ప్రచారం జరిగిన ఈ చిత్రం పలు కారణాల వల్ల కొంత షూటింగ్ జరిగాక మధ్యలోనే ఆగిపోయింది. ఈ చిత్రం సమయంలో హీరో రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన దాదాపుగా నెలరోజులకు పైగా ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. ఆ తరువాత ఈ సినిమా ఊసే అందరూ మరచిపోయారు.
అయితే ఈ చిత్రం అప్పట్లో ఈ చిత్రం సాకారమై ఉంటే అది బాహుబలిని మించి సక్సెస్ అయిఉండేదని ఆ తరువాత కొన్ని సందర్భాల్లో దర్శకుడు కె.ఎస్. రవికుమార్ వ్యాఖ్యానించాడు. ‘రానా’ చిత్రం పూర్తై ఉంటే అది చాలా గొప్ప సినిమా అయి ఉండేదని, బాహుబలి కన్నా పెద్ద విజయం సాధించేదని కూడా చెప్పుకొచ్చాడు. ఆ చిత్రాన్ని తాను పక్కా ప్లానింగ్‌తో 300 రోజుల్లోపై పూర్తి చేయాలని అప్పట్లో ప్రణాళిక వేసుకున్నట్టు కూడా తెలిపాడు. నిజానికి అప్పట్లో రజనీకాంత్ కున్న మార్కెట్‌ను పరగణనలోకి తీసుకుంటే అతడు చెప్పేవిషయంలో వాస్తవాన్ని కొట్టి పారేయలేం. అయితే మరి అంత నమ్మకమున్న ప్రాజెక్టుపై ఆ తరువాత ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయారోనన్నది మాత్రం ఇప్పటికీ చెప్పలేదు ఈ డైరెక్టర్. స్టార్ హీరోలకు సంబంధించి కూడా ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఆగిపోవడం విచిత్రమే మరి.