కంగనా సోషల్ పోస్ట్‌లకు సెన్సార్‌... సుప్రీం కోర్టులో పిటిషన్

Vimalatha
సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతున్న తారల్లో కంగనా రనౌత్ ఒకరు. సినిమాల్లో తన అద్భుతమైన నటనతో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది కంగనా. ట్విట్టర్‌లో కంగనాను బ్యాన్ చేయగా, తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తరచుగా తన ఆలోచనలను పంచుకుంటుంది. ఎక్కువగా సామాజిక సమస్యల గురించే ఆమె పోస్టులు ఉంటాయి. దీని కారణంగా ఆమెపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా కంగనా రనౌత్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భవిష్యత్తులో ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లన్నింటినీ సెన్సార్ చేయాలనే డిమాండ్ ఆ పిటిషన్ లో ఉండడం విశేషం. అయితే ఈ పిటిషన్‌ను ఎవరు దాఖలు చేశారన్న సమాచారం లేదు. తాజాగా భటిండాకు చెందిన ఓ వ్యక్తిపై కంగనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కంగనా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది.
 
ముంబై ఉగ్రదాడిలో అమరవీరులను స్మరించుకుంటూ ఓ పోస్ట్ పెట్టిన తర్వాత తనకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని కంగనా చెప్పింది. కంగనా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా జీకి కూడా లేఖ రాస్తూ "మీరు కూడా ఒక మహిళ, మీ అత్తగారు ఇందిరా గాంధీ జీ చివరి నిమిషం వరకు ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా పోరాడారు" అని రాశారు. అటువంటి తీవ్రవాద, విధ్వంసక మరియు దేశ వ్యతిరేక శక్తుల నుండి వచ్చే బెదిరింపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దయచేసి పంజాబ్ ముఖ్యమంత్రిని ఆదేశించండి అంటూ ఆ లేఖలో రిక్వెస్ట్ చేసింది.
 
సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్ట్ చేసినందుకు నటి కంగనాకు డిసెంబర్ 6న హాజరవ్వాలని ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ సమన్లు పంపింది. ఈ కమిటీకి రాఘవ్ చద్దా చైర్మన్‌గా ఉన్నారు. వ్యవసాయ చట్టాల పునరుద్ధరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కంగనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది అనే పదాన్ని ఉపయోగించారు. దీంతో రైతులను ఖలిస్తానీ అని పిలిచి సిక్కు సమాజాన్ని కంగనా అవమానించిందని ఢిల్లీ, ముంబైలోని సిక్కు సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదైంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: