లైగర్ లో మైక్ టైసన్ పారితోషికం ఎంతో తెలుసా..?

NAGARJUNA NAKKA
బాక్సింగ్‌ లెజెండ్ మైక్‌ టైసన్ 'లైగర్'లో నటిస్తున్నాడు అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మైక్ టైసన్‌ని తన సినిమాలో నటించేందుకు పూరీ జగన్నాథ్ ఎలా ఒప్పించాడని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇప్పుడు టైసన్‌ పారితోషికం గురించి వినిపిస్తోన్న వార్తలు అయితే హాట్ టాపిక్ గా మారాయి.

విజయ్ దేవరకొండ సినీ కెరియర్ లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమా 'లైగర్'. పూరీ జగన్నాథ్, కరణ్‌ జోహార్‌ సంయుక్త నిర్మాణంలో తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్ టైసన్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.  

'లైగర్' సినిమా కోసం విజయ్‌ దేవరకొండ చెమటోడుస్తున్నాడు. జిమ్ లో ట్రైనింగ్ సమక్షంలో గంటల కొద్దీ కష్టపడుతున్నాడు. అంతేకాదు నిజమైన బాక్సింగ్‌ చాంపియన్‌లా కనిపించేందుకు కండలు పెంచాడు. అలాగే బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకుండా పూరీ అండ్‌ టీమ్‌తోనే ట్రావెల్ చేస్తున్నాడు. రెండేళ్లుగా సెట్స్‌లో ఉన్న ఈ మూవీకి విజయ్‌ 15 నుంచి 20 కోట్ల వరకు తీసుకుంటున్నాడనే టాక్‌ ఉంది.

'లైగర్‌' కోసం మైక్‌ టైసన్‌ని ఒప్పించడానికి నిర్మాతలు భారీగా చెల్లించారనే ప్రచారం జరుగుతోంది. మైక్‌ టైసన్‌కి విజయ్‌ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే పోస్టర్‌లో  టైసన్‌ ఉంటే 'లైగర్'కి భారీ బిజినెస్ జరిగే అవకాశముంది. టైసన్‌కి ఇస్తున్న దానికి డబుల్, త్రిబుల్‌ ప్రాఫిట్స్ వస్తాయని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. అందుకే టైసన్‌కి ప్రొడ్యూసర్లు భారీగా ముట్టజెబుతున్నారనే టాక్ వినిపిస్తోంది.  

మొత్తానికి లైగర్ మూవీలో మైక్ టైసన్ నటిస్తుండటంతో... అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వెండితెరపైకి వస్తుందా అని రౌడీహీరో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైసన్ ను ఎలా చూపించబోతున్నారు... విజయ్ ఎలా కనిపించబోతున్నాడు అనే దానిపై తెగ మాట్లాడుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: