టాప్ హీరోలను డామినేట్ చేసి సక్సస్ అయిన సాయి పల్లవి !
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సద్దుమణిగాక ధియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఫ్యామిలీ ప్రేక్షకులు ధియేటర్ల వైపు రాకపోవడంతో వారిని ఎలా రప్పించాలో తెలియక ఇండస్ట్రీ వర్గాలు తలపట్టుకున్నాయి. దీనితో టాప్ హీరోల సినిమాలు వస్తేకాని ఫ్యామిలీ ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చే అవకాశంలేదు అన్న విశ్లేషణలు కూడ వచ్చాయి.
అయితే ఈ అంచనాలు అన్నీ తప్పు అని సాయి పల్లవి మ్యానియా రుజువు చేసింది. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడ అనేకమంది ఫ్యామిలీ ప్రేక్షకులు తమ కరోనా భయాలు పక్కకుపెట్టి ‘లవ్ స్టోరీ’ సినిమాకోసం ధియేటర్లకు రావడంతో ధియేటర్లు అన్నీ కళకళలాడుతున్నాయి.
వాస్తవానికి గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో వానలు పడుతున్నప్పటికీ ‘లవ్ స్టోరీ’ మూవీని చూడటానికి ప్రేక్షకులు రావడం శుభసూచకం అనీ ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవితో సమానంగా నటించినప్పటికీ పేరు మాత్రం ఎక్కువగా సాయి పల్లవికి వచ్చింది.
అయితే చైతన్య కెరియర్ లో ఇప్పటివరకు ఏసినిమాకు రానంత స్థాయిలో ఈ మూవీ కలక్షన్స్ ఇప్పటివరకు వచ్చాయి అని అంటున్నారు. వాస్తవానికి ఈ మూవీకి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల గురించి కంటే ఈమూవీలో నటించిన సాయి పల్లవి గురించి సగటు ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో సగటు ప్రేక్షకుడుకి సంతృప్తి లేకపోయినప్పటికీ దాని ప్రభావం ఈమూవీ కలక్షన్స్ పై లేదు అంటున్నారు. దీనికి కారణం ఈమూవీ కథనంలో ఉన్న చిన్నచిన్న పొరపాట్లు సాయి పల్లవి మ్యానియా ముందు తేలిపోయింది. ఈమూవీ సక్సస్ మీట్ లో కూడ అతిధులు ఎక్కువగా సాయి పల్లవి నటన గురించి ప్రశంసలు కురిపించారు అంటే ఈ వారం ఇండస్ట్రీలో సాయి పల్లవి వారంగా మారిపోయిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మంచి కథలతో సినిమాలు వస్తే ఎన్ని అడ్డంకులు ఉన్నా ధియేటర్లకు ప్రేక్షకులు వస్తారు అన్నది ‘లవ్ స్టోరీ’ రుజువు చేసింది..