విడుదలైన చిన్న సినిమాలు.. స్టార్ హీరోల గుండెల్లో గుబులు..!
చాలా రోజుల తర్వాత థియేటర్లు తెరవగా.. భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తారని అందరూ భావించారు. కానీ వారి ఊహకందని రీతిలో థియేటర్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. మంచి కథాబలం తో తెరకెక్కిన సినిమాలు సైతం ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయలేకపోతున్నాయి. దీనితో స్టార్ హీరోల గుండెల్లో గుబులు పుడుతోంది. విరాట పర్వం, మహా సముద్రం, సన్ ఆఫ్ ఇండియా, ఎఫ్3, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఏ హీరో ధైర్యం చేసి తమ సినిమాని ముందుగా విడుదల చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు రీఓపెన్ అయినప్పుడు జాతి రత్నాలు, వకీల్ సాబ్ వంటి చిత్రాలు ప్రేక్షకులను థియేటర్ల ముందు క్యూ కట్టించాయి. కానీ సెకండ్ వేవ్ తర్వాత ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో స్టార్ హీరోలు తమ సినిమాల రిలీజ్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు అని తెలుస్తోంది. వాస్తవానికి కరోనా కాలంలో చాలామంది ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దీనితో థియేటర్లకు వెళ్లి మరీ చూడడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అందులోనూ చాలా సినిమాలు నెల రోజుల వ్యవధిలోనే డిజిటల్ తెరపై రిలీజ్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో భారీ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.