ఆశలు చిగురిస్తాయా..? ఆవిరైపోతాయా..!
కరోనా ఎఫెక్ట్ తో గతేడాది నుంచి బాలీవుడ్ లాక్‌డౌన్‌లోనే ఉంది. తెలుగునాట ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు' లాంటి హిట్స్ వచ్చినా, బాలీవుడ్లో మాత్రం థియేటర్లకి జోష్ రాలేదు. దీంతో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు కూడా వాళ్ల సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమా, అక్షయ్ కుమార్ 'లక్ష్మీ', అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌ల 'సర్దార్ కా గ్రాండ్సన్' సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. అయితే ఈ మూవీస్ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదు. పరిణీతి చోప్రా 'సైనా', సినిమా అయితే ఓటీటీలో కూడా డిజాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని నార్త్‌లో మళ్లీ థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఈ నెల 27న అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' సినిమా.. అలాగే ఆగస్ట్ 6న 'అతరంగీ రే' సినిమాని విడుదల కాబోతున్నాయి. ఈ మూవీలో అక్షయ్ కుమార్‌తో పాటు ధనుష్, సారా అలీ ఖాన్ కూడా నటించారు.
స్టార్ హీరోలు బరిలో దిగితే థియేటర్లకి పండగొస్తుంది. భారీ ఓపెనింగ్స్, హౌస్‌ఫుల్ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ పండిట్స్ కూడా లెక్కలేస్తుంటారు. అందుకే స్టార్ల సినిమాల కోసం థియేటర్లు ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. బాలీవుడ్ కూడా ఇలాగే టాప్ హీరోల సినిమా కోసం ఎదురుచూస్తోంది.
ఆలియా భట్ ఫుల్ మాస్ రోల్ ప్లే చేసిన సినిమా 'గంగూభాయ్ కఠియావాడి'. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఈ సినిమాని మల్టీలింగ్వల్‌గా రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడే ఉన్నాయి. దీంతో మల్టీమార్కెట్ గురించి ఆలోచించకుండా, బాలీవుడ్‌కి మెయిన్ సోర్స్ అయిన నార్త్ రీజియన్‌లో ఈ 30న 'గంగూభాయ్'ని విడుదల చేస్తున్నారు.