కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశానికి కారణం ఎవరో తెలుసా ?

VAMSI
తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన అరుదైన నటుడు కోట శ్రీనివాసరావు. ఆనాటి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇతర భాషల నుండి తెలుగు పరిశ్రమకు వచ్చి నటించే వారే ఎక్కువగా ఉండడం విశేషం. కానీ ఒక్క కోట శ్రీనివాసరావు మాత్రమే తెలుగు నుండి ఇతర భాషల్లో వెళ్లి నటించారు. ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించి తెలుగు సినిమా పరిశ్రమలో ఎవ్వరికీ దక్కని మంచి పేరును సంపాదించుకున్నాడు. అప్పటి ఎస్ వి రంగారావు, రావు గోపాల్ రావు, సత్యనారాయణ వంటి వారి తరువాత ఒక ప్రత్యామ్నాయంగా కోట ఉన్నారు. పాత్ర ఏదైనా తన సహజ నటనతో రక్తి కట్టించడంలో సిద్దహస్తుడని చెప్పాలి. ఈయన నటించిన ఏ సినిమా చూసినా అందులో ఈయన పాత్ర అంతలా హైలైట్ అవుతుంది. కోట ఒక మద్యతరగతి తండ్రిగా, ఒక పిసినారిగా, ఒక విలన్ గా, ఒక అవినీతి మంత్రిగా ఇలా ఎన్నో పాత్రలను అద్భుతంగా పండించిన ఘనుడు.

ఈ రోజు మన తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన కోట శ్రీనివాసరావు ఎవరి ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు ? అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఏ విధంగా కోట సినిమాల్లోకి వచ్చాడో ఒకసారి తెలుసుకుందాము. మాములుగా ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కోట శ్రీనివాసరావుకు నాటకాలు అంటే అమితమైన ఇష్టం. ఆ రోజుల్లో నాటకాలకున్న ఆదరణ అటువంటిది. దాదాపుగా బాల్యం నుండే నాటకాలు చేయడం ప్రారంభించిన కోట శ్రీనివాసరావు 20 సంవత్సరాల అనుభవాన్ని గడించాడు.

1978 వ సంవసరంలో కోట శ్రీనివాసరావు "ప్రాణం ఖరీదు" అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో ఆ నాటకాన్ని తిలకిస్తున్న వారిలో దర్శకుడు మరియు నిర్మాత అయిన క్రాంతి కుమార్ కు ఆ కథ పట్ల అభిమానం పెరిగింది. ఎలాగైనా ఈ నాటకాన్ని సినిమాగా తీయాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇందులో నటీనటులుగా ఈ నాటకంలో నటించిన వారినే తీసుకోవాలనుకోవడం ఆయన గొప్పతనం అనుకోవాలి. అప్పుడు స్వయంగా క్రాంతి కుమార్ అందరినీ ఈ సినిమా గురించి చెప్పి అందులో వారే నటించాలని అడిగాడట, ఇంకేముంది సినిమా అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. అలా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. లేకుంటే తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయి ఉండేది. ఈ రోజు కోట శ్రీనివాసరావు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: