వాళ్లు చెప్తున్నారు సరే.. మరి నష్టాలు భరించేదెవరు..?
కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీని రెండేళ్ల నుంచి వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. 2020 ఏలాగూ గడిచిపోయింది. 2021 అయినా కలిసొస్తుంది అనుకుంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఈ ఏడాది కరోనా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. సెకండ్ వేవ్తో షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతబడి వందలకోట్ల బిజినెస్ ఆగిపోయింది. వాయిదాలతో నిర్మాతలపై వడ్డీల భారం పెరిగిపోతోంది.
గతేడాది మార్చి నెలలో కరోనా లాక్డౌన్తో మొదటిసారి థియేటర్లు మూతబడ్డాయి. దాదాపుగా ఎనిమిది నెలలు సినిమా హాళ్లు తెరుచుకోలేదు. ఆ సమయంలో మెయింటెనెన్స్ ఖర్చులు భరించలేక కొంతమంది యజమానులు వాళ్ల సినిమా హాల్స్ ని ఫంక్షన్ హాల్స్గా, గోడౌన్స్గా మార్చేశారు.
గతేడాది డిసెంబర్ నుంచి థియేటర్స్ మళ్లీ తెరుచుకున్నాయి. మిగతా రాష్ట్రాల్లో జనాలు సినిమా హాల్స్కి వెళ్లకపోయినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రేక్షకులు థియేటర్లను ఆదరించారు. కరోనా నిబంధనల మధ్య హౌస్ఫుల్ కలెక్షన్లు ఇచ్చారు. దీంతో టాలీవుడ్ స్టార్లంతా రెట్టింపు ఉత్సాహంతో విడుదల తేదీలు ప్రకటించారు. 2021లో భారీ బ్లాక్బస్టర్స్ ఊహించారు. కానీ ఇంతలోనే పరిస్థితులు మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు పర్మీషన్ అయితే వచ్చింది కానీ.. బొమ్మ వేసేందు నిర్మాతలు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థర్డ్ వేవ్ కలవరం రేపుతుండటంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ వారిలో లేకపోలేదు.మొత్తానికి సినీ ఇండస్ట్రీని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. చూద్దాం మంచి రోజులు వస్తాయోమో.