సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలనటుడిగా పలు సినిమాల్లో యాక్ట్ చేసి అప్పట్లోనే ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్న మహేష్ బాబు, ఆపై రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో తండ్రి కృష్ణకు తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇక ఆ తరువాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకుంటూ కొనసాగుతున్న సూపర్ స్టార్ కు అటు ప్రేక్షకులతో పాటు అనేక మంది సినిమా ప్రముఖుల్లో కూడా అభిమానులు వున్నారు.
ఆ విధంగా మహేష్ బాబు కు పెద్ద అభిమాని అయిన వారిలో తమిళ దర్శకుడు లింగు స్వామి కూడా ఒకరు. తమిళ్ లో మొదటగా ఆనందం అనే సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన లింగు స్వామి ఆ తరువాత మాధవన్ తో తీసిన రన్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు. అక్కడి నుండి దర్శకుడిగా పలు సినిమా చేస్తూ కొనసాగుతున్న లింగుస్వామి 2010లో కార్తీ తో ఆవారా మూవీ తెరకెక్కించి మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తమన్నా హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఆ సినిమాని తిరుపతి బ్రదర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మంచి యాక్షన్ తో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథని మొదట సూపర్ స్టార్ మహేష్ కోసం లింగు స్వామి రాసారని కొన్ని టాలీవుడ్ వర్గాల టాక్.
పలు ఇంటర్వూస్ లో అలానే వేదికల్లో తాను సూపర్ స్టార్ కు పెద్ద అభిమాని అని చెప్పే లింగుస్వామి అప్పట్లో ఆ స్టోరీ ని మహేష్ కోసం రాసుకోగా, అదే సమయంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ తో ఖలేజా సినిమా చేస్తుండడం వలన ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో దానిని కార్తీ తో తీసారట లింగుస్వామి. ఆ సినిమా విజయంతో హీరోగా కార్తీ గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు. అందులోని యాక్షన్, ఫైట్ సీన్స్ తో పాటు సాంగ్స్ ఇప్పటికీ కూడా అక్కడక్కడ వినపడుతూనే ఉంటాయి. మరి ఒకవేళ మహేష్ బాబు ఆ సినిమా చేసి ఉంటె, అప్పట్లో లింగుస్వామి కి టాలీవుడ్ లో పెద్ద బ్రేక్ దొరికి ఉండేదని చెప్పాలి .... !!