ప్రారంభం కాబోతున్న ఓటీటీ పండుగ !
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సద్దుబాటు అయినప్పటికీ ధియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరికీ క్లారిటీ లేదు. ఆగష్టు నుండి సినిమాల విడుదలకు లైన్ క్లియర్ అవుతున్నా చాలామంది నిర్మాతలు ఏమాత్రం ఆశాభావంతో లేరు. దీనికి కారణం థర్డ్ వేవ్ గురించి వస్తున్న వార్తలు.
ఈ థర్డ్ వేవ్ గురించి రకరకాల ఊహాగానాలు వస్తూ ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు ముఖ్యంగా నిర్మాతలు విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక అంచనా ప్రకారం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న అనేక సినిమాలకు సంబంధించిన నిర్మాతలు సుమారు వడ్డీలకే 300 కోట్లకు పైగా నష్టపోతున్నారు అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతుంది.
దీనితో సినిమాల రిలీజ్ లపై నమ్మకం లేక చాల సినిమాలు ఓటీటీ బాట పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘నారప్ప’ ‘దృశ్యం 2’ తమ ఓటీటీ డీల్స్ ను ఫైనల్ చేసుకున్న పరిస్థితులలో మరో 12 సినిమాలు ఈ లిస్టులో చేరబోతున్నాయి అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. దీనితో సినిమాలు అన్నీ ఓటీటీ బాట పడితే ఎగ్జిబిషన్ రంగం ఏమవ్వాలి? అన్న గందరగోళం మొదలైంది. అయితే ఎవరు ఏమనుకున్నా మునుముందుగా డజను పైగా సినిమాలు ఓటీటీ రిలీజ్ లకు ఒప్పందాలు సాగిపోతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని డీల్స్ పూర్తయితే మరికొన్ని డీల్స్ చర్చల దశలో ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.
నితిన్ ‘మ్యాస్ట్రో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘పాగల్’ ‘గుడ్ లక్ సఖి’ ‘రొమాంటిక్’ ‘తిమ్మరుసు’ ‘గుర్తుందా శీతాకాలం’ ‘బతుకు బస్టాండ్’ ‘వరుడు కావలెను’ సినిమాలు అన్నీ మరో రెండు మూడు నెలల్లో వరసగా ఓటీటీ లలో సందడి చేయడం ఖాయం అని అంటున్నారు. ఈ సినిమాలలో నటించిన హీరోలు కూడ తమ నిర్మాతల శ్రేయస్సు రీత్యా తమ సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడానికి ఇష్టపడుతున్నట్లు టాక్. ఈ వార్తలే నిజం అయితే ఇక కేవలం భారీ సినిమాలు ధియేటర్లలో చిన్న మీడియం రేంజ్ సినిమాలు ఓటీటీ లలో కనిపిస్తాయి కాబట్టి తెలుగు ప్రజలకు ఓటీటీ పండగ మొదలైనట్లే అనుకోవాలి..