చిన్నారి ప్రాణం కాపాడిన హీరో సుధీర్‌బాబు..?

ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో సెల‌బ్రిటీ హోదాను ఎంజాయ్ చేయ‌డ‌మేకాదు.. సామాజిక బాధ్య‌త‌ను నెర‌వేర్చ‌డంలోనూ టాలీవుడ్ న‌టీన‌టులు ముందే ఉంటారు. ఎవ‌రైనా క‌ష్టాల్లో ఉన్న ఘ‌ట‌న‌లు త‌మ దృష్టికి వస్తే వారిని ఆదుకునేందుకు త‌మ వంతు సాయం అందించిన ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. చిరంజీవి, బాల‌కృష్ణ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, తార‌క్ ఈవ‌రుస‌లో ముందుంటారు. ఈ బాట‌లోనే తెరపైన హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. నిజ జీవితంలో సామాన్యుల‌ను ఆదుకుంటాన‌ని నిరూపించుకున్నాడు సుధీర్‌ బాబు. పుట్టుక‌తోనే గుండె వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆపరేషన్‌ చేయించి పెద్ద మనసును చాటుకున్నాడు. కొన్నాళ్ల క్రితం బేబీ సంస్కృతి కోసం సోషల్‌ మీడియా వేదికగా సుధీర్ బాబు ఒక ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మం నిర్వహించాడు. ట్విటర్ ద్వారా ఆ చిన్నారి హార్ట్ ప్రాబ్లం గురించి చెప్పాడు. ఆ చిన్నారి గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కుంటోంద‌ని, ఆమె వైద్య చికిత్స కోసం తాను రూ. 1 లక్ష అందిస్తున్నాన‌ని, కానీ ఆపరేషన్, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలని, అందుకు నిధులు సేక‌రిస్తున్నాన‌ని, అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ట్విట్ట‌ర్ లో పిలుపునిచ్చాడు.

ఆ చిన్నారి ప‌రిస్థితి సుధీర్‌ బాబు ద్వారా తెలుసుకున్న ప‌లువురు విరాళాలు పంపించారు. దీంతో ఆ చిన్నారికి శ‌స్త్ర చికిత్స జ‌రిగి ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది కూడా.  త‌ను పెద్ద‌య్యాక ఆమె చ‌దువుకోసం బ్యాంకులో కొంత సొమ్ము డిపాజిట్‌ చేస్తానని హామీ ఇచ్చాడు సుధీర్‌ బాబు. పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసిన సుధీర్‌బాబుపై నెటిజెన్ల నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. సుధీర్‌బాబు మామ‌గారైన సూప‌ర్‌స్టార్ కృష్ణకు ఇండ‌స్ట్రీలో మంచి వ్య‌క్తి అన్న పేరుంది. ఆయ‌న సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గి క‌ష్టాల్లో ఉన్న ప‌లువురు న‌టీన‌టులకు సాయం అందించేవారని చెబుతారు. ఆయ‌న వార‌సుడు మ‌హేష్‌బాబు కొన్ని గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: