ఏడాదికి 20 సినిమా చేసి వారెవ్వా అనిపించిన చంద్రమోహన్..

Mamatha Reddy
చంద్రమోహన్.. ప్రస్తుత తరానికి ఆయన ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపిన నటుడు. ఎన్నో సినిమాల్లో నటించి తన సత్తా చాటుకున్నారు. ఒకానొక సమయంలో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో మంచి అనుభవం సంపాదించాడు. ఆ కారణం చేతనే సినిమా రంగం వైపు ఆయన అడుగులు పడ్డాయి.

బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుడు.. ఆయన పేరును చంద్రమోహన్ అని పెట్టారు. బి.యన్. రెడ్డి తెరకెక్కించిన  రంగులరాట్నం చిత్రంలో తెలుగు పరిశ్రమకు హీరోగా  పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలు చేశారు. ప్రతి పాత్రలో ఆయన జీవించే వారు.  నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు, జగ్గయ్య చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. తన తరం హీరోలయిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిత్రాలలోనూ ముఖ్య పాత్రలు చేశారు. ఏడాదికి ఇరవై చిత్రాల్లో నటించి వారెవ్వా అనిపించారు చంద్రమోహన్.

ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, చంద్రమోహన్ కు అన్న వరుస అవుతారు. ప్రతిభ లేకుంటే ఏ అన్న అయినా  ఆదరించడు అనే విషయం అందరికీ తెలిసిందే..  అలాగే విశ్వనాథ్ తన చిత్రాల్లో చంద్రమోహన్ కు తగ్గ పాత్రలుంటే తప్పక అతణ్ణే పిలిపించేవారు. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన  సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం వంటి సినిమాలు మంచి పేరు సంపాదించి పెట్టాయి.  ఇంటింటి రామాయణం, పదహారేళ్ళ వయసు, తాయారమ్మ-బంగారయ్య, కోరికలే గుర్రాలయితే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, గోపాలరావుగారి అమ్మాయి, పెళ్ళిచూపులు, రాధాకళ్యాణం, మూడుముళ్ళు  మొదలైన చిత్రాల్లోనూ చంద్రమోహన్ హీరోగా నటించి మెప్పించారు. ఆయన సరసన  నటించిన జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి వంటి వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు.  76 సంవత్సరాలు దాటినా, ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ముందుకు సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: