టాలీవుడ్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిన కె.వి.రెడ్డి..!

Suma Kallamadi
తెలుగు చలన చిత్ర రంగంలో గొప్ప దర్శకులలో మొట్ట మొదటి స్థానం లో కె.వి.రెడ్డి (కదిరి వెంకటరెడ్డి) నిలుస్తారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సినిమా దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, ప్రొడక్షన్ మేనేజర్ గా పలు దశాబ్ధాల పాటు కొనసాగిన కె.వి.రెడ్డి టాలీవుడ్ రంగం లో తనదైన ముద్ర వేశారు. జానపద, సామాజిక, ఫాంటసీ సినిమాలు రూపొందించి గొప్ప దర్శకుడిగా పేరొందిన కె.వి.రెడ్డి మూడు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మొత్తం పదిహేను చిత్రాలు డైరెక్టర్ చేయగా.. వాటిలో 10 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. గుణసుందరి కథ, పాతాళ భైరవి, మాయాబజార్, జగదేకవీరుని కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు వంటి అద్భుతమైన దృశ్య కావ్యలను రూపొందించి తెలుగు ప్రేక్షకులను మైమరిపించారు.

కె.వి.రెడ్డి పాతాళభైరవి సినిమా తో టాలీవుడ్ పరిశ్రమ ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. ఆయన కారణంగానే విజయా వాహిని స్టూడియోస్ నిర్మాణ సంస్థ నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. ఆయన డైరెక్ట్ చేసిన పెద్దమనుషులు, పెళ్లినాటి ప్రమాణాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ పురస్కారాలు పొందాయి. కె.వి.రెడ్డి.. నందమూరి తారక రామారావు, ఎస్వీ రంగారావు వంటి గొప్ప నటులకి మంచి అవకాశాలు ఇచ్చి వారి భవిష్యత్తుని మార్చేశారు. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల కెరీర్ కు కె.వి రెడ్డి గారే పునాది వేశారని చెబుతుంటారు.

కె.వి.రెడ్డి దర్శకత్వం లో వచ్చిన మరొక అపురూప చిత్రం "మాయాబజార్". ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి అనే ప్రశ్నతో ఓ ప్రముఖ వార్తా సంస్థ 2013లో నిర్వహించిన పోల్ లో మాయాబజార్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ, సంగీతం, డైలాగులు మాటల్లో వర్ణించలేనంత అత్యద్భుతంగా ఉన్నాయి. ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలోనే బాహుబలి వంటి సినిమాలను తలదన్నే గొప్ప సినిమాలను రూపొందించిన కె.వి. రెడ్డి ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: