వకీల్ సాబ్ సినిమా పై ఏపి సర్కార్ కక్ష.. అందుకే అలా.. !
కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది. ,అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ ప్రీమియర్ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంతమంది ఏడో తేదీన ప్రీమియర్ షోల టికెట్లను కొన్ని థియేటర్లలో కొనుగోలు చేశారు. అయితే నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా జేసీ ఈ సినిమా ప్రీమియర్ షో లకు అనుమతి ఇవ్వలేదని, టికెట్ల ధరల పెంపు లేదని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఇటీవల విడుదలైన నితిన్ చిత్రం 'రంగ్ దే'కు టికెట్ ధరలను పెంపును అనుమతించిన రాష్ట్రప్రభుత్వం.. వకీల్‌సాబ్ చిత్రానికి అడ్డంకులు ఎందుకు పెడుతోందని నిలదీశారు. ఇంకోవైపు.. జాయింట్ కలెక్టర్ ప్రకటనతో ఎగ్జిబిటర్లు కూడా డైలమాలో పడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు గిట్టుబాటు ఉండదని నిర్మాతలు, పంపిణీదారులు అంటున్నారు. గాంధీనగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన గలాటా నేపథ్యంలో థియేటర్ల వద్ద పరిస్థితులు ఏ క్షణాన ఎలా మారతాయోనని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.. థియేటర్ల దగ్గర బందోబస్తు ను ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా టాక్ పాజిటివ్ గా వినిపిస్తుంది. కలెక్షన్ల పరిస్థితి ఎంటో సాయంత్రం చూడాలి..