నిండిపోయిన హైదరాబాద్ స్టూడియోస్ ఖంగారు పడుతున్న నిర్మాతలు !
సంక్రాంతి సినిమాల సందడి మొదలు అయినా ఎక్కడా ఇంకా కలక్షన్స్ జోరు అందుకోలేదు. సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల ఆన్ లైన్ టిక్కెట్స్ బుకింగ్ చాల నెమ్మదిగా కొనసాగుతోందికాని ఎక్కడా సంక్రాంతి స్పీడ్ కనపడటం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే కలక్షన్స్ వ్యవహారం ఎలా ఉన్నా ఏప్రియల్ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడుతుంది అన్న అంచనాలతో సినిమాల షూటింగ్ లు మటుకు చాల జోరుగా జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు భాగ్యనగరంలోని పెద్ద స్టూడియోల నుండి చిన్న స్టూడియోల వరకు వాటికి సంబంధించిన అన్ని ఫ్లోర్స్ ఈ సంవత్సరం చివరి వరకు ఒక్కరోజు కూడ ఖాళీ లేకుండ ముందుగానే బుక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
టాప్ హీరోల సినిమాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళి షూటింగ్ లు చేసే పరిస్థితులు లేకపోవడంతో పాటు లండన్ యూరప్ అమెరికా లాంటి దేశాలలో కరోనా 2 కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితులలో ఇప్పట్లో విదేశాలకు షూటింగ్ ల కోసం వెళ్ళలేమనీ అటు హీరోలు ఇటు దర్శక నిర్మాతలు ఒక స్థిర నిర్ణయానికి వచ్చేయడంతో విదేశాల వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ స్టూడియోలలో సెట్స్ వేసి షూటింగ్ లు జరపాలని నిర్ణయం తీసుకోవడంతో ఇలా ఒక్కసారిగా స్టూడియోల ఫ్లోర్స్ అన్నీ చాల ముందుగానే బుక్ అయిపోయాయి అని అంటున్నారు.
క్రితం సంవత్సరం కరోనా పరిస్థితులు వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఫిలిం స్టూడియోల బిజినెస్ ఇప్పుడు ఒకేసారి ఊపు అందుకోవడంతో ఒక స్టూడియో ఫ్లోర్ ను బుక్ చేసుకోవాలి అంటే అధిక మొత్తాలు చెల్లించ వలసి రావడమే కాకుండా దీనికోసం భారీ స్థాయిలో రికమండేషన్స్ చేయించుకోవలసిన పరిస్థితి అని అంటున్నారు. వాస్తవానికి సినిమా ధియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ ఒకప్పటి జోష్ ప్రేక్షకులలో ఇంకా కనిపించడంలేదు. అయితే ఏప్రియల్ నుండి అంతా మారిపోతుంది అన్న అంచనాలతో పరుగులు తీస్తున్న షూటింగ్ లు ఇప్పుడు స్టూడియోలకు కాసులు కురిపిస్తున్నాయి అనుకోవాలి..