త్వరలోనే త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించిన యంగ్ హీరో

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ అనగానే గుర్తొచ్చే పేరు రామ్ పోతినేని. ఈ ఎనర్జిటిక్ స్టార్ తాజాగా నటించిన చిత్రం రెడ్. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చాలా మంది రెడ్ సినిమా ఓటీటీలో రాబోతోందంటూ చెప్పుకొచ్చారు. అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు చిత్ర నిర్మాతలను కూడా సంప్రదించి భారీ అమౌంట్‌ ఆఫర్ చేసినప్పటికి ఒప్పుకోలేదట. ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకుని ఇప్పుడు విడుదలకు సిద్దమయ్యారు. కిషోర్ తిరుమ‌ల దర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి కూడా మంచి హైప్‌ను సంపాదించుకుంది.

చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో.. సినిమా పక్కా హిట్ టాక్ సాధిస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని రామ్ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే రామ్ తరువాతి చిత్రంపై ఇప్పుడు చర్చ మొదలైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్‌తో ఓ సినిమా చేయబోతున్నారంటూ ఫిల్మ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రెడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ మాట్లాడుతూ.. ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

తాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని అన్నాడు. ఇటీవల తాను త్రివిక్రమ్ కలిశామని, అనేక విషయాల గురించి మాట్లాడుకున్నామని తెలిపాడు. త్రివిక్రమ్‌తో తన సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పేశాడు. కానీ.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం తనకు కూడా తెలియదని అన్నాడు. రామ్ ప్రకటనతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు, రామ్ కలయికలో సినిమా వస్తే అది కచ్చితంగా హిట్ అయి తీరుతుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: