రజినీ కాంత్ రాజకీయ నిర్ణయంపై రాఘవ లారెన్స్ ఏమన్నారంటే..

కొత్త సంవత్సరం రోజు రాజకీయ ప్రకటన చేస్తానంటూ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన అనారోగ్యం కారణంగా అపోలోలో చేరడం, అక్కడి నుంచే రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెప్పడం జరిగిపోయింది. తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడని రజినీ కాంత్ అభిమానులు ఎంతగానో ఆశపడితే.. వారందరికి ఈ వార్త నిరాశను మాత్రమే మిగిల్చింది. అంతేకాదు.. రజినీకాంత్ నిర్ణయం మార్చుకోవాలంటూ ఆయన అభిమానులు ఆందోళనలు కూడా చేయడం మొదలుపెట్టారు. దీంతో రజినీ కాంత్ మరోమారు తన అభిమానులకు క్లారిటీ ఇచ్చేందుకు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.

తాను రాజకీయాల్లోకి రావడం లేదని, తన నిర్ణయం ఫైనల్ అని, రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేయొద్దంటూ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఇక తాజాగా రజినీకాంత్‌ వీరాభిమానుల్లో ఒకరైన రాఘవ లారెన్స్‌ తెరపైకి వచ్చారు. తాజాగా ఆయన ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రాకపోవడంతో మీరెంత బాధ పడుతున్నారో నేను కూడా అంతే బాధను అనుభవిస్తున్నా. కానీ, తలైవర్ వేరే ఏదైనా కారణం చెప్పి ఉంటే మనం ఆయన నిర్ణయం మార్చుకోమని అడగొచ్చు. కానీ తలైవర్ చెప్పిన ముఖ్య కారణం అనారోగ్యం.

ఇలాంటి పరిస్థితుల్లో మనం అభ్యర్థన చేసి ఆయన ఒప్పుకొని నిర్ణయాన్ని మార్చుకొని రాజకీయాల్లోకి వచ్చి అప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే మనం మన జీవితాంతం ఆ బాధను మర్చిపోలేము. అయినా రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన మాత్రం ఎప్పటికీ నా గురువే. ఆయనతో సన్నిహితంగా మాట్లాడిన వాడిగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నాకు తెలుసు. అందుకే ఇప్పుడు మనమందరం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఆయన కోసం నా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయి. గురువే శరణం’’ అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. మరి రజినీ కాంత్ అభిమానులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: