సూపర్ స్టార్ కృష్ణ బాలసుబ్రహ్మణ్యం మధ్య అలనాటి ఇగో వార్ పై కోటి కామెంట్స్ !
గంధర్వులు ఆకాశంలో విహరిస్తూ ఉంటే ఒక గాన గంధర్వుడు తప్పిపోయి భూలోకానికి వచ్చేసాడని ఆకథ నిజం అయితే ఆ గంధర్వుడు బాలు మాత్రమే అంటూ కోటి అభిప్రాయ పడుతున్నాడు. బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అనేక హోమాలు అభిషేకాలు బాలు వైద్యం పొందుతున్న హాస్పటల్ రూమ్ పక్కన ప్రత్యేకమైన రూమ్ లో ఆ పూజలు నిర్వహిస్తున్న విషయం తెలిస్తే బాలు కోలుకోవాలని అందరు ఎంతగా ఆశ పడుతున్నారు అన్నది అర్ధం అవుతుంది.
ఇదే సందర్భంలో కోటి మాట్లాడుతూ తెలుగు భాషను ఏవిధంగా గౌరవించాలి అన్న విషయం తెలియాలి అంటే బాలు పాటను బట్టి అర్ధం అవుతుంది అంటూ సంగీత పరంగా ఆయన ఒక శిఖరం అని అంటున్నాడు. అయితే ఇలాంటి గొప్ప వ్యక్తి బాలుకి అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణతో వచ్చిన అభిప్రాయభేదాల పై కోటి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. ఒక చిన్న భేదాభిప్రాయం వల్ల అప్పట్లో కృష్ణకు బాలుకు మధ్య గ్యాప్ ఏర్పడిందని దానితో కృష్ణ అప్పట్లో తన సినిమాలకు బాలు తో కాకుండా రాజా సీతారామ్ చేత పాటలు పాడించిన విషయాలు గుర్తుకు చేసుకున్నాడు.
అయితే అప్పట్లో కృష్ణ సినిమాలకు బాలు పాటలు పాడక పోవడం తనకు లోటుగా అనిపించి వారిద్దరి మధ్య ఏర్పడ్డ చిన్న అభిప్రాయభేదాన్ని తోలిగించడంలో తాను రాయబారాలు చేసిన విషయం గుర్తుకు చేసుకున్నాడు. అప్పట్లో కృష్ణ దగ్గరికి తాను బాలు ను తీసుకు వెళ్ళినప్పుడు ‘బాలు ఎలా ఉన్నావు’ అంటూ కృష్ణ పలకరించగానే బాలు చిన్న పిల్లవాడిగా మారిపోయి కృష్ణను కౌగలించుకుని అత్యంత ప్రేమతో వినయంగా మాట్లాడిన బాలసుబ్రహ్మణ్యం ను చూస్తే ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటమే ఆయన గొప్పతనం అని అంటున్నాడు..