లాక్ డౌన్ వల్ల లాభపడిన ఒకే ఒక్క నిర్మాత..

Deekshitha Reddy
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా 30రోజుల్లో ప్రేమించడం ఎలా. ఏ మహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టారో కానీ.. అంతా రెడీ అయిపోయి విడుదలకు సిద్ధం అనుకున్న టైమ్ లో కరోనా వచ్చి పడింది, లాక్ డౌన్ పుణ్యమా అని సినిమా వాయిదా పడిపోయింది. సినిమా విడుదలైతే 30 రోజుల్లో ప్రేమంచడం ఎలాగో ప్రేక్షకులకు నేర్పాలనుకున్నారు ప్రదీప్. అయితే ఆ 30 రోజులు కాస్తా 5నెలలవుతున్నా సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. తన ఫస్ట్ సినిమానే ఇలా వెనక్కి వెళ్లిపోతోందని తెగ ఇదైపోతున్నాడు ప్రదీప్.
అయితే సినిమాకి లాక్ డౌన్ ఓ విషయంలో బాగా మేలు చేసిందనే చెప్పాలి. అప్పటికే సూపర్ హిట్ గా నిలిచిన సినిమా పాట "నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.." లాక్ డౌన్ లో సంచలనంగా మారింది. యూట్యూబ్ లో ఆ పాటకు వచ్చిన వ్యూస్..  విడుదలకు ముందే ఇంకే పాటకీ రాలేదంటే ఆశ్చర్యం లేదు. అలవైకుంఠ పురములో పాటల తర్వాత ఆ స్థాయిలో హిట్టైన పాట ఇదే. అయితే సినిమా ఇంకా విడుదల కాకముందే పాట ఈ రేంజ్ లో హిట్ కావడం మాత్రం కొసమెరుపు.
ఈ వీడియో సాంగ్ ఏకంగా యూ ట్యూబ్ లో 200 మిలియన్ల వ్యూస్ సాధించింది. అంటే 20కోట్ల వ్యూస్. యూట్యూబ్ లో ప్రతి మిలియన్ వ్యూస్ కి 500 డాలర్లు వస్తుంది, అంటే ఈ పాటకి ఇప్పటి వరకు సుమారు 70లక్షల రూపాయల రాబడి వచ్చిందనమాట. దీంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీ అయిపోయారు. యూట్యూబ్ తో పాటు ఇతర ప్లాట్ ఫామ్స్ కూడా ఆడియో రైట్స్ ద్వారా భారీగానే ముట్టజెప్పాయట. దీంతో సినిమా విడుదలకు ముందే కేవలం ఒకే ఒక్క పాట ద్వారా లాభాలు కళ్లజూస్తున్నారట నిర్మాత ఎస్వీ బాబు. ఈ పాట ద్వారా రచయిత చంద్రబోస్ కి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కి, గాయకులు సిద్ శ్రీరామ్, సునీతకి.. మరింత పేరొచ్చింది. సినిమా విడుదలయ్యాక దర్శకుడు మున్నా ప్రతిభ ఎలా ఉందో తెరపై చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: