కాంట్రవర్శీ డైరెక్టర్ పై సినిమాలు..!

NAGARJUNA NAKKA

పిల్లిని గదిలో బంధిస్తే.. ఎంత కాలమని భరిస్తుంది. ఏదైతే అదైందని తిరుగుతుంది. ప్రస్తుతం వర్మ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇంత వరకూ ఎవరూ మాట్లాడటం లేదు.. ఎదురు తిరగడం లేదని.. కాంట్రవర్శీ సినిమాలు తీశాడు. పవర్ స్టార్ మూవీ దగ్గరికొచ్చేసరికి ఫ్యాన్స్ ఫైర్ కావడమే కాదు యుద్ధమే ప్రకటించారు. వర్మ చేష్టలను.. బుద్దిని ఎండగడుతూ.. ఈ కాంట్రవర్శీ డైరెక్టర్ పై సినిమాలు.. వెబ్ సిరీస్ లు తీసేస్తున్నారు.. వర్మని మించి రచ్చ చేస్తున్నారు. 

 

వర్మ టేకింగ్ కాలం చెల్లి దశాబ్దం దాటింది. ఇక కథ.. కథనం అంటే ఏమిటో ఎప్పుడో మర్చిపోయాడు. ఏదో ఒక వివాదం ఎంచుకొని.. ఫ్రీ పబ్లిసిటీతో మనుగడ సాగిస్తున్నాడు వర్మ. కాంట్రవర్శీని కూడా తనకిష్టమొచ్చిన రీతిలో ఖూనీ చేసి పారేస్తాడు. ఏదో ఒక వివాదంతో కాలక్షేపం చేసే వర్మకు ప్రత్యర్థుల నుంచి సెగ తగిలింది. పవర్ స్టార్ మూవీలో పాత్రలు ఎవరివైనా పోలి ఉంటే అది యాధృశ్చికమే తప్ప మరొకటి లేదని చెబుతున్న వర్మను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. వర్మ మాదిరి యాదృశ్చికం అని చెప్పకుండా.. నీ గురించి నీ సినిమానే అంటూ పరాన్న జీవి సినిమా తీశారు. 

 

పవర్ స్టార్ మూవీ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తూ.. అది ఆయన సినిమా కాదని నీలా అబద్దాలు చెప్పమని.. పరాన్న జీవి అంటే అదేదో వింత జీవి కాదని.. నీ సినిమానే అంటూ ధైర్యంగా చెబుతున్నారు మెగా ఫ్యాన్స్. నీ కుట్రలు.. కుతంత్రాలు.. దొంగ ప్రమాణాలు.. ఒక్కటేంటి..అన్నీ పూస గుచ్చినట్టు చూపిస్తామంటూ.. పవర్ స్టార్ రిలీజ్ అయిన రోజునే.. పరాన్న జీవిని రిలీజ్ చేస్తున్నారు. 

 

వర్మపై రూపొందుతోన్న మరో సెటైరికల్ మూవీ పార్న్ జీవి. పోర్న్ వీడియోలు, చూస్తానని చెప్పే వర్మకు తగ్గ టైటిల్ పార్న్ జీవి అంటున్నారు. పెళ్లాం వదిలేసిన ఒక దర్శకుడి కథ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక ముసలి జీవి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోందని దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: