చెల్లాచెదురైన పవన్ డ్రీమ్స్!

Seetha Sailaja

ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సమస్యలు వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో చిన్నస్థాయి నటీనటులు ఇబ్బంది పడుతున్నారు కాని టాప్ రేంజ్ హీరోలు ఎవరు ఇబ్బంది పడటంలేదు అన్నది వాస్తవం. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు మాత్రం పవన్ కళ్యాణ్ వేసుకున్న అన్ని ప్లాన్స్ ను పూర్తిగా నిరాశ పరిచింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 


వాస్తవానికి ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత పవన్ కళ్యాణ్ కు అవకాశాలు ఎన్నో వచ్చాయి. అయితే ఆ అవకాశాలు అన్నీ వదులుకుని తెలుగు రాష్ట్రాల ప్రజల పై మితిమీరిన నమ్మకంతో తన ‘జనసేన’ ను జనంలోకి తీసుకు వెళ్ళడానికి దాదాపు సంవత్సరంనర పాటు పవన్ జనం మధ్యనే ఉన్నాడు. అయితే పవన్ ను చూడటానికి జనం వచ్చారు. కాని వచ్చిన జనం ఓట్లు వేయకపోవడంతో గత సంవత్సరం ఎన్నికలలో పవన్ ఘోరంగా ఓడిపోయాడు.


దీనితో జ్ఞానోదయం పొంది తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకుని అతడి కెరియర్ లో ఎప్పుడు లేనివిధంగా ఒకేసారి రెండు సినిమాలు మొదలుపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమాలకు సంబంధించి పవన్ కు ప్రతి సినిమాకు 40 కోట్ల పారితోషికం ఇవ్వడానికి అప్పట్లో నిర్మాతలు కూడ ఒప్పుకున్నారు అని వార్తలు వచ్చాయి. 


అయితే కరోనా పరిస్థితులు వల్ల అన్నీ తారుమారు కావడంతో పవన్ సినిమాలు ఆగిపోవడమే కాకుండా పవన్ తన సినిమాలకు సంబంధించి ఒప్పుకున్న పారితోషికాన్ని కూడ తగ్గించుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న లీకులు వస్తున్నాయి. అన్నీ  అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే పవన్ తాను ఒప్పుకున్నా మూడు సినిమాలను 2021 లోపున పూర్తి చేసి 2022 నుండి మళ్ళీ ఒక భారీ పాదయాత్రను మొదలుపెట్టి సుమారు 2 సంవత్సరాలు జనం మధ్యనే ఉంటూ 2024 ఎన్నికలకు తన ‘జనసేన’ కు జీవం పోయాలని పవన్ ఎన్నో కలలు కన్నాడు అని అంటున్నారు. ఇప్పుడు కరోనా వచ్చి పవన్ సినిమాలు అన్నీ ఆగిపోవడంతో అతడి ఆదాయానికి గండి పడటమే కాకుండా అతడి భవిష్యత్ రాజకీయ ప్లాన్స్ అన్నీ అయోమయ పరిస్థితికి చేరుకున్నాయి. కొనసాగుతున్న ఈ అయోమయానికి ప్రస్తుతం పవన్ చేపట్టిన చాతుర్మాస్య దీక్ష ఎంతవరకు పవన్ కు పరిష్కారాలు చూపెడుతుందో చూడాలి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: