సినీ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు… తామేంటో నిరూపించుకోవడానికి వేలమంది ఎదురు చూస్తుంటారు. సినిమాల్లోకి రావడానికి అవకాశాలు దొరక్క అల్లాడిపోతుంటారు. అయితే అన్నీ చేతిలో ఉన్నా… టాలీవుడ్లో కుర్ర హీరోలు స్ట్రగుల్ అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్లతో డీలా పడిపోతున్నారు. అసలు యంగ్ హీరోల అపజయాలకు కారణమేంటి?.
చిత్రపరిశ్రమలో నిత్యం కొత్తనీరు వస్తూనే ఉంటుంది. సినిమాను కెరీర్ గా మల్చుకునేందుకు యువత ఆసక్తి చూపుతోంది. వీరిలో కొందరికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటే… ఇంకొంతమంది ఎలాంటి సిఫార్సులు లేకుండానే హీరోలుగా పరిచయం అవుతున్నారు. కెరీర్లో మొదట్లో హిట్లు ఇచ్చి.. ఇప్పుడు సక్సెస్ కొట్టలేక చతికిల పడిన యంగ్ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. వీరిలో ముందుంటాడు వరుణ్ సందేశ్.
హ్యాపీడేస్ మూవీ సక్సెస్తో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. కొత్తబంగారు లోకం సినిమా వరుణ్ సందేశ్ క్రేజ్ పెంచేసింది. వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అయితే తొలి రెండు సినిమాలు ఇచ్చిన విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు వరుణ్. కొత్త బంగారులోకం తర్వాత వరుణ్ సందేశ్ 14 సినిమాలు చేసినా… ఒక్క హిట్ కూడా అందుకోలేక పోయాడు. విజయాలు లేకపోయినా వివాదాల్లో ముందుంటాడీ హీరో. హీరోయిన్లతో ఎఫైర్లతో పాటు పలు వివాదాల్లో అతని పేరు వినిపించింది. దీంతో వరుణ్ కెరీర్ పూర్తిగా గాడి తప్పింది.
సోలో హీరోగా హిట్ కొట్టలేనని అర్థం చేసుకున్నాడేమో కానీ… మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా యాక్ట్ చేశాడు. అయితే వరుణ్ సందేశ్ చేతిలో అవకాశాలు పుష్కలంగా ఉన్నా… రొటీన్ క్యారెక్టర్స్ చేయడంతో ప్రేక్షకులకు చేరువ కాలేకపోతున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటించిన నువ్వలా నేనిలా, ఉదయం, ఈ వర్షం సాక్షిగా సినిమాలు షూటింగ్‌లో ఉన్నాయి.. వీటిలో ఏది వరుణ్ సందేశ్ కెరీర్‌కి ప్లస్ అవుతుందో చూడాలి.
సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం. ఒక్క హిట్ టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తే… ఒకే ఒక్క ఫ్లాప్ కెరీర్ను బలి తీసుకుంటుంది. ఇది అర్థం చేసుకోలేని యంగ్ హీరోలు… చేతికి వచ్చిన విజయాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. ఫెయిల్యూర్ బాటలో ఉన్న మరో హీరో నవదీప్. డైరెక్టర్ తేజ పరిచయం చేసిన వారిలో నవదీప్ ఒకడు. పదేళ్ల క్రితం వచ్చిన జై సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన నవదీప్‌కు లెక్కకు మించిన అవకాశాలు వచ్చాయి. నవదీప్ యాక్షన్ విషయంలో బెటర్‌గానే కనిపించినా… విజయాలు మాత్రం దోబూచులాడుతున్నాయి. గౌతమ్ SSC సినిమా తర్వాత సోలో హీరోగా నవదీప్ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. అయితే చందమామ, ఆర్య 2, బాద్షా సినిమాలు నవదీప్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక లేటెస్ట్‌గా వచ్చిన బంగారు కోడిపెట్ట కూడా ఈ హీరోని నిరాశేపర్చింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి… హీరోగా మారాడు తనీష్. దేవుళ్లు, మన్మధుడు సినిమాల్లో బాలనటుడిగా యాక్ట్ చేసిన తనీష్… తొలి సినిమా ‘నచ్చావులే’తో హిట్ కొట్టాడు. నచ్చావులే తర్వాత నానీ, తనీష్ హీరోలుగా వచ్చిన రైడ్ సినిమా సక్సెస్ అయింది. దీంతో తనీష్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. 14 సినిమాల్లో హీరోగా నటించాడీ కుర్ర హీరో. వరుణ్‌సందేశ్, నవదీప్‌లాగే తనీష్‌ది కూడా సేమ్ స్టోరీ. కెరీర్ మొదట్లో ఉన్న జోరు ఇప్పుడు కనిపించడం లేదు. చేతినిండా సినిమాలున్నా…హిట్లు మాత్రం కనిపించడం లేదు. వరుస సినిమాలకు సైన్ చేస్తున్న తనీష్… క్యారెక్టర్ల ఎంపికలో తడబడుతున్నాడు. ప్రస్తుతం ఈ కుర్రహీరో నటించిన దేవదాస్ స్టైల్ మార్చాడు రిలీజ్‌కి రెడీగా ఉంది.
మొత్తానికి మెరుపు వేగంతో వస్తున్న కుర్ర హీరోలు… అదే వేగంతో పాతాళానికి పడిపోతున్నారు. ఒకటి, రెండు హిట్లు కొట్టాక… అదే స్థాయిలో కష్టపడలేకపోతున్నారు. కొత్తతరం నటుల్లో క్రమశిక్షణ లేకపోవడమే… వారి అపజయాలకు కారణమంటున్నారు సినీ విశ్లేషకులు. కెరీర్ను సీరియస్ గా తీసుకోకపోవడమే దెబ్బతీస్తోందని చెప్తున్నారు.
ఈ ముగ్గురి హీరోలపై మీ కామెంట్..?
మరింత సమాచారం తెలుసుకోండి: