గ్లామర్ గా కనిపిస్తేనే ఛాన్సులు వస్తాయా..!
కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్ తమిళంలో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకోగా తెలుగులో అమ్మడు వరుస ఛాన్సులు అందుకుంటుంది. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నివేదా ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో సినిమాలో నటించి మెప్పించింది. పాత్ర ప్రాధాన్యతను బట్టే సినిమాలు ఒప్పుకుంటా అని చెబుతున్న నివేదా పేతురాజ్ గ్లామర్ పాత్రలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. కథా బలం ఉన్న సినిమాల్లో గ్లామర్ గా కనిపించాల్సిన అవసరం ఉండదు అందుకే అలంటి సినిమాలకే తన ఓటు అంటుంది నివేదా పేతురాజ్.
తెలుగులో చేసిన సినిమాలే కాదు తమిళంలో కూడా ఆమె గ్లామర్ గా కనిపించిన పాత్రలు చేయలేదు. గ్లామర్ అంటే అందంగా కనిపించడమే తప్ప దానికోసం స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదని అంటుంది నివేదా.. చూడగానే మన పక్కింటి అమ్మాయి అన్నట్టు కనిపించే ఈ అమ్మడికి తెలుగులో ఇంకా సరైన గుర్తింపు రాలేదని చెప్పాలి. అల వైకుంఠపురములో చిన్న పాత్రే అయినా త్రివిక్రమ్ డైరక్షన్ లో చేయాలనే కారణంతో ఆ సినిమా చేశానని అంటుంది నివేదా.
ప్రస్తుతం దేవా కట్టా డైరక్షన్ లో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో అమ్మడు లక్కీ ఛాన్స్ పట్టేసింది. గ్లామర్ విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయని. అలాగని తాను గ్లామర్ షో చేయడానికి అడ్డు చెప్పానని కాం ఫ్యూజ్ చేస్తుంది చెన్నై చిన్నది. మరి అమ్మడిని ఒప్పించి ఆమెతో గ్లామర్ రోల్స్ చేసే దర్శకుడు ఎవరో చూడాలి. సాయి తేజ్ నటించిన చిత్రలహరిలో సెకండ్ ఫిమేల్ లీడ్ గా చేసిన నివేదా ఇప్పుడు సాయి తేజ్ కు జంటగా నటించడం విశేషం. ఈ సినిమా హిట్ అయితే నివేదా పేతురాజ్ కు తెలుగులో మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.