వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్.. భీష్మ హిట్టిస్తుందా...?

Reddy P Rajasekhar

నితిన్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రం రేపు విడుదల కాబోతుంది. హ్యాట్రిక్ ఫ్లాపులతో సినిమా సినిమాకు మార్కెట్ తగ్గుతున్న నితిన్ భీష్మ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న రష్మిక మందన్నా హీరోయిన్ కావడం, ఛలో సినిమా తరువాత వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోతగ్గ మార్కెట్ ఉన్న నితిన్ ఆ మార్కెట్ ను నిలబెట్టుకోవాలంటే మాత్రం భీష్మ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి. గతంలో దశాబ్ద కాలం పాటు ఫ్లాపులతో నితిన్ కెరీర్ నెమ్మదించగా ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమా విజయాలతో నితిన్ కెరీర్ పుంజుకుంది. అ ఆ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ ఆ సినిమా తరువాత నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. 
 
అ ఆ సినిమా తరువాత నితిన్ లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలలో నటించాడు. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. శ్రీనివాస్ కళ్యాణం తరువాత కొంత గ్యాప్ తీసుకొని నితిన్ భీష్మ సినిమాలో నటించాడు. ఇప్పటికే విడుదలైన భీష్మ టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. మరోవైపు ఈ సినిమా వివాదంలో చిక్కుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
బీజేపీ ధార్మిక సెల్ మహాభారతంలోని భీష్ముడి పేరును టైటిల్ గా పెట్టడం వలన హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయని ఆవేదన వ్యక్తం చేసింది. బీజేపీ ధార్మిక్ సెల్ సభ్యులు ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడి పేరును లవర్ బోయ్ పాత్రకు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. భీష్మ సినిమా తరువాత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: