పవన్ కళ్యాణ్ యొక్క ప్రత్యేక ఫ్లైట్ ఖర్చులన్నీ భరించనున్న దిల్ రాజు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో తీసిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ కావడంతో.. తన ప్రేక్షకులంతా మళ్లీ పవన్ సినిమా తీసి హిట్ ఎప్పుడు కొడతాడోనని తెగ వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్' రీమేక్ సినిమాని తెలుగులో తీసేందుకు అంగీకరించాడన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్న 'పింక్' తెలుగు రీమేక్ సినిమాని దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ పిరియాడిక్ డ్రామా చిత్రంలో నటిస్తుండగా... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మే నెల 15లోపు పింక్ రీమేక్ విడుదలవుతుందని ఆ సినీ నిర్మాత దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే సినిమా చిత్రీకరణ వెంటనే పూర్తవ్వాలంటే జనసేన పార్టీని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రతిరోజు అవైలబుల్ గా ఉండాలి. కానీ అలా జరగాలంటే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా జనసేన పార్టీని పట్టించుకోకుండా కేవలం షూటింగ్ కి మాత్రమే పరిమితమై ఉండాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీని పట్టించుకోకుండా సినిమాలు చేస్తే... అతడు సరైన రాజకీయ వేత్త కాదని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. అందుకే ఆ పేరును తెచ్చుకోకూడదని పవన్ కళ్యాణ్ వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించి ప్రజల సంరక్షణ కోసం పోరాడనున్నాడు.
అయితే, తరచూ ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు షూటింగ్ కి డుమ్మా కొడితే... నిర్మాత అయిన దిల్ రాజుకి రూ.20 నుంచి 25 లక్షల నష్టం వాటిల్లుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకొని... మళ్లీ అమరావతి వెళ్లాలంటే కాస్త శ్రమతో కూడిన పనే. అందుకే దిల్ రాజు ఒక ప్రవేట్ ఫ్లైట్ ని పవన్ కళ్యాణ్ రాకపోకల కోసం మాట్లాడారట. ఒక చార్టెడ్ ఫ్లైట్ లో పవన్ కళ్యాణ్ ని అమరావతి కి తీసుకువెళ్లి మళ్లీ హైదరాబాద్ తీసుకొచ్చేందుకు దాదాపు పది లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. రూ.25 లక్షలు పెట్టి రీ షెడ్యూల్ చేయడం కంటే ప్రత్యేక ఫ్లైట్ ఖర్చులు భరించడం బెటర్ అని దిల్ రాజు భావించినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం.