అన్ని రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా గ్లామర్ ఫీల్డ్‌లో అది ఒకింత ఎక్కువే. అవకాశాలకోసం ఎంతో మందిని కలవాల్సి వస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని అవసరానికి వాడుకునే వారు కొందరైతే.. లొంగని వారిని వేధింపులకు గురిచేసేవారు మరికొందరు. కెరీర్ ఆరంభంలో ఇలాంటి అవమానాలను ఎన్నో భరించాల్సి వస్తుంది నటీమణులు. ఈ మధ్య కొందరు నటీమణులు తమకు జరిగిన అవమానాలను నలుగురితో పంచుకుంటున్నారు. బహిరంగంగా ఆయా వ్యక్తులను విమర్శిస్తున్నారు. సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నారు. ఈ ఖాతాలో తాజాగా నటి విద్యాబాలన్ కూడా చేరారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో తాను కూడా ఇలాంటి అవమానాలనే ఎదుర్కొన్నానన్నారు ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఇటీవల ఆమె నటించిన మిషన్ మంగళ్ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో చెన్నైలో ఉన్నప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను కలవడానికి వచ్చాడనీ... తనతో మాట్లాడేందుకు రూమ్‌లోకి వెళ్దామని కోరినట్టు ఆమె చెప్పారు. కాఫీ షాప్‌లో కూర్చొని మాట్లాడుకుందాం అంటే విన్లేదనీ.. ఆయన మాట ప్రకారం హోటల్ రూమ్‌కి వెళ్లామన్నారు. లోపలికి వెళ్లగానే రూమ్ తలుపులు వేసి తనతో వెకిలిగా ప్రవర్తించినట్టు విద్యాబాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తనకు కోపం వచ్చి గట్టిగా మాట్లాడి తలుపు తీసి వెళ్లిపోమన్నట్లు చూసినట్టు వెల్లడించింది. వెంటనే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆనాటి చేదు సంఘటన గుర్తు చేసుకున్నారు విద్యాబాలన్.
అంతేకాదు విద్యాబాలన్ తనకు జరిగిన మరొక అవమానాన్ని గురించి కూడా తెలిపారు. ఓ నిర్మాతను కలుద్దామని అమ్మానాన్నలతో వెళ్తే.. అసలు నీది హీరోయిన్ ఫేసేనా. ఓ సారి అద్ధంలో చూసుకో అంటూ హేళనగా మాట్లాడారని వాపోయారు విద్యాబాలన్. వారి మాటలు అప్పటికి బాధించినా హీరోయిన్‌గా ఎదిగి తానేంటో నిరూపించు కోవాలనుకున్నానన్నారు విద్యాబాలన్. మొత్తం మీద.. ఏదేమైనా.. అవమానాలు ఎన్ని ఎదురైనా తట్టుకుని అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగిన విద్యాబాలన్ నేటి నటీమణులకు ఆదర్శం.