నిన్నరాత్రి అత్యంత అట్టహాసంగా ప్రారంభం అయిన ‘బిగ్ బాస్ 3’ సీజన్ షో వేదిక నుండి నాగార్జున తన పై వచ్చిన విమర్శలకు క్లారిటీ ఇచ్చాడు. గతంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్’ షో తనకు నచ్చదు అని చేసిన కామెంట్స్ పై జరిగిన రగడను పరోక్షంగా వివరిస్తూ తనకు ఇష్టం లేకపోయినా కోట్లమంది బుల్లితెర ప్రేక్షకులకు అసలు ‘బిగ్ బాస్’ షో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో అన్ని దేశాలలో ఎందుకు విజయవంతం అవుతోందో తెలుసుకోవడానికి తాను ఈ షోను హోష్ట్ చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.
అత్యంత భారీ సెట్లో ప్రారంభం అయిన ‘బిగ్ బాస్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగార్జున చాల అందంగా తన లుక్ ను మార్చుకుని వచ్చినా ఎక్కడో మొఖంలో తగ్గిన గ్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఆలోటును కవర్ చేసుకుంటూ నాగార్జున తనకు 60 సంవత్సరాలు వస్తున్నా తనలో జోష్ ఏమాత్రం ఏమాత్రం తగ్గలేదు అన్న సంకేతాలు ఇస్తూ ఈ కార్యక్రమ హౌస్ మేట్స్ తో చాల హుషార్ గా మాట్లాడుతూ తన బాడీ లాంగ్వేజ్ కూడ తన జోష్ కు సరిపోయే విధంగా జాగ్రత్త పడ్డాడు.
ఈ షోను అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ షో పై ఎన్ని రూమర్లు వచ్చినా ఈ షో అనుకున్న తేదీకి అనుకున్నట్లుగా ప్రసారం కావడంతో ఈ షో పై విమర్శలు చేసావారి కామెంట్స్ కు పూర్తి సపోర్ట్ ప్రజల నుండి లభించలేదా అని అనిపిస్తుంది. హిందీ భాష నుండి మన దేశంలో అనేక భాషలలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి అంటే ఈ కార్యక్రమం పై విమర్శలు చేసిన వారి శక్తి సరిపోలేదు అని అనిపించడం సహజం.
ఈ షో గురించి ఎన్నో ఛానల్స్ ఎన్నో చర్చలు పెట్టినా ఈ షోను నిషేధించమని న్యాయస్థానాల మెట్లు ఎక్కినా ప్రస్తుతానికి ఎటువంటి స్పందనా లేని నేపధ్యంలో రాబోతున్న వంద రోజులలో ఈ షోకు వచ్చే ప్రమాదం ఏమీ కనిపించడం లేదు. ఏ విషయంలో అయినా చాల తెలివిగా ప్రవర్తించే నాగార్జున ‘బిగ్ బాస్’ షోను తాను ఎందుకు హోష్ట్ చేస్తున్నాడో తెలివిగా వివరించిన సందర్భం నాగ్ సమయస్పూర్తిని మరొకసారి బయటపెట్టింది..