నిన్న సాయంత్రం ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ విషయాలను వివరిస్తూ మధ్యలో పవన్ కళ్యాణ్ ఓటమి పై స్పందించాడు. అభిమానులలో పవన్ కు ఉన్న మ్యానియాను ప్రాతిపదికగా తీసుకుంటే పవన్ కు పడ్డ ఓట్ల శాతం చాల తక్కువ అన్న తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
అంతేకాదు పవన్ అత్యంత ఆవేశంతో మాట్లాడే రాజకీయ ఉపన్యాసాలు టివిలో ప్రసారం అవుతున్నప్పుడు తాను కూడ ఎంతో ఆసక్తిగా చూసాను అన్న విషయాన్ని బయటపెట్టాడు. అయితే పవన్ కు రాజకీయ వ్యవస్థను మార్చాలి అంటూ ఉన్నంత ఆవేశం ఆవేదన పవన్ ‘జనసేన’ పార్టీలో పనిచేసిన నాయాకులలోను కేడర్ లోను తనకు కనిపించలేదు అంటూ కామెంట్స్ చేసాడు.
బహుశా ఈలోపం వల్లనే పవన్ కు ఎంత ఆవేశం ఉన్నా ఆ ఆవేశం జనంలోకి వెళ్ళలేకపోయి ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నిజాయితీ విషయంలో పవన్ కు ఉన్న నిబద్ధత విషయమై ఓటర్లకు సందేహాలు లేకపోయినా ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పవన్ ఉపన్యాసాలలోని మాటలు లేకపోవడం అతడి ఓటమికి కారణం అయి ఉంటుంది అన్న తన అభిప్రాయాన్ని తెలియచేసాడు.
అంతేకాదు గెలుపు ఓటమిలను పట్టించుకోకుండా జనం మధ్య పవన్ ఉండగలిగితే పవన్ కు రాజకీయ భవిష్యత్ ఉంటుందనీ అయితే అంత ఓర్పు పవన్ కు ఉందా అన్న విషయంలో తాను జోష్యం చెప్పలేను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇప్పటి వరకు అవకాసం చిక్కినప్పుడల్లా పవన్ పై అనేక సెటైర్లు వేసిన వర్మ ఈసారి పవన్ మాటలలోని ఇంటెన్సిటీ జనం అర్ధం చేసుకోలేకపోయారా అన్న కామెంట్స్ మాత్రం ఎంతో కొంత వాస్తవ దృష్టితో చేసినట్లు అనిపిస్తోంది..