‘నోటా’ పరాజయంతో దిగాలు పడ్డ విజయ్ దేవరకొండకు ‘టాక్సీవాలా’ కోరుకున్న కిక్ ను ఇచ్చింది. ఈమూవీ పూర్తిగా విడుదలకు ముందే లీక్ ఆవడంతో అసలు ‘టాక్సీవాలా’ కనీసపు కలక్షన్స్ ను అయినా రాబట్టుకుంటుందా అన్న అనుమానాలు కలిగాయి. అందువల్లనే ఈమూవీ పై భారీ అంచనాలు వద్దు అంటూ విజయ్ కూడ అనేక సార్లు అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు.
అయితే ఎవరు ఊహించని విధంగా కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. తొలిరోజు వసూళ్లతోనే ఈసినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమా బడ్జేట్ చాల తక్కువ కావడంతో పాటు ఈమూవీని ఒప్పుకున్నప్పుడు విజయ్ క్రేజీ హీరో కాకపోవడంతో ఈమూవీ నిర్మాతలు విజయ్ కు ఇచ్చిన పారితోషికం కూడా బాగా తక్కువ.
ఈమూవీ నిర్మాతలు నిన్న ఈమూవీకి ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసినట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ఫెయిల్ అయిపోతుంది అని అనుకున్న సినిమాకు ఈ రేంజ్ లో కలక్షన్స్ రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమాకు మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో కూడ 4 కోట్లు కలక్షన్స్ రావడం విజయ్ విజయ్ మ్యానియాకు నిదర్శనంగా మారింది.
అయితే ఓపెనింగ్స్ పరంగా విజయ్ దేవరకొండ గత చిత్రాలు ‘గీత గోవిందం' ‘నోటా' చిత్రాలతో పోలిస్తే ‘టాక్సీవాలా' ఓపెనింగ్స్ తక్కువగానే ఉన్నాయని చెప్పక తప్పదు. కానీ ఫెయిల్ అవుతుంది అని విపరీతమైన ప్రచారం జరిగిన ఈసినిమాకు టోటల్ గా పూర్తి పాజిటివ్ టాక్ రావడంతో ఈసినిమాకు నిర్మాతలలో ఒకరుగా వ్యవహరించిన అల్లు అరవింద్ కు మళ్ళీ ఊహించని లాభాలు రాబోతున్నాయి. దీనితో అల్లు అర్జున్ తో కూడ ఎప్పుడు చూడని లాభాలు ‘గీత ఆర్ట్స్’ కు విజయ్ దేవరకొండ వల్ల వస్తూ ఉండటంతో రానున్న రోజులలో కూడ అల్లు కాంపౌండ్ విజయ్ దేవరకొండల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగే ఆస్కారం కనిపిస్తోంది..