స్టార్ హీరో ఓ చిన్న హీరో ఫంక్షన్ కు రావడం అంటే కచ్చితంగా అదో పెద్ద విషయమే. రీసెంట్ గా నాగ శౌర్య నటించిన ఛలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారు. ఈ వేడుకకు చిరు రావడం వెనుక కేవలం ఓ కుర్ర హీరోని ప్రోత్సహించడమే అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. అది కూడా తన స్వీయ అనుభవంలో పొందిన ఓ చిన్న అనుభవాన్ని కూడా బయటపెట్టాడు.
ఇంతకీ చిరు ఏమని చెప్పాడు అంటే.. కెరియర్ మొదట్లో తన సినిమా సక్సెస్ అయిన సందర్భంగా జరిగిన 100 రోజుల వేడుకకు అప్పట్లో పెద్ద హీరోని పిలవగా తను బిజీ అవడం వల్ల రాలేదట. అయితే ఇదే విషయాన్ని గుర్తు చేసుకుని తనలా ఏ యువ హీరో బాధపడకూడదని అందుకే నాగ శౌర్య పిలవగానే వచ్చానని అన్నాడు.
చిరు చెప్పిన మాటలను బట్టి చూస్తే తన మొదటి హిట్ ఇది కథ కాదు.. 100 రోజులు ఆడినా అందులో చిరు విలన్ గా నటించారు కాబట్టి అది లెక్క కాదు. ఇక ఆ తర్వాత వచ్చిన పున్నమినాగు సినిమా 100 రోజులు ఆడింది. అందులో నరసింహరాజు హీరో కాని లీడ్ రోల్ చిరంజీవిది. ఆ సినిమా ఫంక్షన్ కే ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ లాంటి వారిని పిలిస్తే వారు రాలేదన్నమాట.
1980 కాలం నాటిది కాబట్టి అప్పట్లో కృష్ణ ఇయర్ కు 10 నుండి 12 సినిమాలు చేస్తూ వచ్చారు. అప్పట్లో సూపర్ స్టార్ ఫాం మాములుగా లేదు. సో చిరు అన్నది కృష్ణ గారినే అంటున్నారు. అయితే చిరు డైరెక్ట్ గా కాకున్నా సరే తనకు జరిగిన అనుభవాన్ని బయటపెట్టి అందరిని షాక్ అయ్యేలా చేశాడు చిరంజీవి.