ఎన్టీఆర్ ను కూడ లెక్క చేయని నారాయణ రెడ్డి !

Seetha Sailaja
 సాహితీ ప్రపంచంలో సినారెగా ప్రసిద్ధిగాంచిన సి. నారాయణరెడ్డి గొప్పకవి మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. అందుకే ప్రముఖకవిగా అప్పటికే పేరు తెచ్చుకున్న నేపధ్యంలో అలనాటి టాప్ హీరో నందమూరి తారకరామారావు పిలిచి సినిమాలలో పాటలు రాసే అవకాశం ఇచ్చినా అప్పట్లో నారాయణ రెడ్డి ఎన్టీఆర్ అభ్యర్దనను తిరస్కరించాడు అన్న వార్తలు అప్పట్లో ఉన్నాయి. 

ఆరోజులలో ‘గులేభకావళి కథ’ కి దర్శకుడు కూడ అయిన ఎన్టీఆర్ ఆసినిమాను నిర్మించాడు. అయితే అప్పటికే పేరు ప్రఖ్యాతలు ఉన్న నారాయణరెడ్డి చేత ఒక పాట వ్రాయించుకోవాలి అని అభిప్రాయపడి ఎన్టీఆర్ తన సొంత తమ్ముడు త్రివిక్రమ్ రావును నారాయణ రెడ్డి దగ్గరకు పంపితే ‘ఒక్క పాట’ అంటే వ్రాయను సినిమాలోని అన్ని పాటలను వ్రాయమంటే వ్రాస్తాను కాని మొక్కుబడిగా ఎదో ఒక పాట తనను వ్రాయమంటే వ్రాయను అంటూ ఆత్మాభిమానంతో ఎన్టీఆర్ కే సున్నితంగా సమాధానం ఆరోజులలో నారాయణ రెడ్డి ఇచ్చారు అని అంటారు.

నారాయణ రెడ్డి ఆత్మాభిమానానికి షాక్ అయిన ఎన్టీఆర్ నారాయణ రెడ్డి చేత ‘గులేభకావళి’ సినిమాలో 12 పాటలను వ్రాయించి అప్పట్లో నారాయణ రెడ్డి గొప్పతనాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలిసి వచ్చేలా చేసాడు. అలా తొలి సినిమాతోనే ‘సింగిల్ కార్డ్’ పాటల రచయితగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఘనత నారాయణ రెడ్డిది. ఆ తరువాత ఎన్నో వేల పాటలను ఎన్నో సినిమాలకు వ్రాసిన నారాయణ రెడ్డి సినీ ప్రస్థానం ఒక చరిత్ర. 
 
తెలుగు సాహితీ రంగంలోనే కాకుండా తెలుగు సినిమా రంగంలో ఒక అరుదైన ముద్ర వేసుకున్న సినారె 3 వేల పాటలు సినిమాలకు వ్రాసి లోకంలోనూ.. సినిమా రంగంలోనూ తనదైన ముద్రలు వదిలివెళ్లిన ఆయన తీరు తెలుగువాడి గుండెల్లో విషాదాన్ని నింపింది. 1977లో పద్మపురస్కారాన్ని అందుకున్నారు. 1988లో ఆయన రచించిన ‘విశ్వంభర’  కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. ఈ కావ్యం గొప్పతనం ఏమిటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మాత్రమే కాకుండా సివిల్స్ లోనూ పాఠ్యాంశంగా నేటికి ఉంది. 

1992లో అత్యున్నత పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ ను పొంది 1997లో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ఘన చరిత్ర నారాయణ రెడ్డిది. అనేక విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ గా ఏపీ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడుగా ఎన్నో పదవులు పొందిన నారాయణ రెడ్డి మరణించినా ఆయన వ్రాసిన ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు తెలుగు సినిమా రంగం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటాయి. అదే సినారె గొప్పతనం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: