‘బాహుబలి’ వన్ మూవీలో శివలింగం సీన్ ను చూసిన ఏ ప్రేక్షకుడు అయినా ఆ సీన్ లో రాజమౌళి పలికించిన ఎమోషన్స్ ను చూసి పులకరించిపోయారు. అయితే అటువంటి టచింగ్ సీన్ ను తీసిన రాజమౌళి నాస్తికుడు అని అంటే ఎవరు నమ్మరు. కాని ఇది వాస్తవం ఈవిషయం వేరెవరో కాదు స్వయంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.
‘బాహుబలి 2’ రిలీజ్ సందర్భంగా నిన్న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి ఈసీక్రెట్ ను బయట పెట్టాడు. అంతేకాదు తాను నాస్తికుడిగా మారడానికి కారణాలు కూడా వివరించాడు. 'ఇదేమీ రాత్రికిరాత్రి జరిగిపోలేదు. టీనేజ్ లో ఉన్నపుడు నేను బాగా సాంప్రదాయాలు పాటించి, కాషాయం కట్టుకు తిరిగేవాడిని, గుళ్ళకు, చర్చిలకు వెళ్లి సందేశాలను వినేవాడిని. ఎంత భక్తి మార్గంలో ఉన్నా నాకు నేను సంతోషంగా ఉన్నానని భావించలేకపోయేవాడిని. ఆ వాతావరణం అంతా సంతృప్తిని ఇచ్చేది కాదు' అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు రాజ మౌళి.
అయితే కొన్నేళ్ల తర్వాత తానూ ఫలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత నాస్తికుడైన నిర్మాత దర్శకుడు గుణ్ణం గంగరాజుతో కలిసి పనిచేసినప్పుడు ఆయన ఇచ్చిన అయాన్ ర్యాండ్ రాసిన ‘ఫౌంటెన్ హెడ్’ పుస్తకం తన ఆలోచనలను పూర్తిగా మార్చివేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయాన్ ర్యాండ్ సిద్ధాంతాలు తన వ్యక్తిత్వాన్ని అదేవిధంగా తన ఆలోచనా విధానం పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయాలను బయట పెట్టాడు జక్కన్న.
దీనితో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన రాజమౌళి నాస్తికుడు అన్న విషయం తెలుసుకుని చాలామంది షాక్ అయ్యారు. భావోద్వేగ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడంలో దేశంలోనే రాజమౌళిని మించిన దర్శకుడు లేడు అని అంటారు. అలాగే తన సినిమాల్లో దేవుళ్లకు సంబంధించిన సన్నివేశాలను కూడా రాజమౌళి అద్భుతంగా తెరకెక్కిస్తుంటాడు.
యుక్త వయస్సులో కాషాయం కట్టుకుని పూజలు బాగాచేసిన రాజమౌళి ఇప్పుడు సినిమాలనే దైవంగా చూస్తూ భగవద్గీత సారాంశం ప్రకారం మనం చేసే పనిలోనే దైవాన్ని చూస్తూ ఇండియన్ ఫిలిం ఇంస్ట్రీ లో సంచలనాలు సృష్టిస్తున్నాడనుకోవాలి..