సుబ్బిరామిరెడ్డికి షాక్ ఇచ్చిన చిరంజీవి జోక్ !

Seetha Sailaja
మెగాస్టార్ చిరంజీవి కళాబందు సుబ్బిరమిరెడ్డిల మధ్య స్నేహం ఈనాటిదికాదు. చిరంజీవి మెగా స్టార్ గా ఒకవెలుగు వెలుగుతున్న రోజులలో సుబ్బిరామిరెడ్డి చిరంజీవిని హీరోగా పెట్టి ‘స్టేట్ రౌడీ’ సినిమాను చేసారు. ఈమూవీ ఆ రోజులలో ఒక సంచలనం. ఇప్పటికీ వీరిద్దరి మధ్య అదే  శాన్నిహిత్యం కొనసాగుతున్న నేపధ్యంలో నిన్న సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన టి.ఎస్.ఆర్ అవార్డ్స్ మీట్ కు ముఖ్య అతిథిగా వచ్చాడు చిరంజీవి. 

అయితే ఈ ఫంక్షన్ లో మాట్లాడిన చిరంజీవి వేసిన జోక్ కు సుబ్బిరామి రెడ్డికి కూడా షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే  ఉత్తరాంధ్ర జిల్లాలతో ముఖ్యంగా విశాఖపట్నంతో చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు చిరంజీవి ప్రతి సినిమా విశాఖలో షూటింగ్ జరుపుకునేది. అక్కడి ప్రేక్షకులకు చిరు సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారు. దీనితో విశాఖ పేరెత్తితే చిరులో ఎక్కడలేని ఉత్సాహం ఉద్వేగం వచ్చేస్తుంది. 

నిన్న జరిగిన అవార్డుల వేడుక కోసం విశాఖకు వెళ్లిన చిరు మరోసారి ఈ ప్రాంతంపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వేడుకకు తాను టీఎస్సార్ కోసం రాలేదని కేవలం ఇక్కడి అభిమానుల కోసమే వచ్చానని అన్నారు. తన కోసమే వచ్చానని టీఎస్సార్ అనుకుంటే అది పొరబాటని చిరు చమత్కరించాడు.  అంతేకాదు చిరంజీవి ఈసందర్భంలో మాట్లాడుతూ ‘‘నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే అభిమానులు నన్ను గొప్పగా ఆదరిస్తారు. ఈలలు చప్పట్లతో ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొస్తారు. ఇక్కడి వాళ్లు నా మీద చూపించే అభిమానం అసాధారణం. అందుకే వైజాగ్ రావడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా సరే చాలా ఉత్సాహంగా వస్తాను. పాపం నాకోసమే చిరు వచ్చారని సుబ్బిరామిరెడ్డి గారు అనుకుంటున్నారు. కాదు నేను మీ కోసమే వచ్చాను. బిజీ షెడ్యూల్ వల్ల ఈ వేడుకకు రాలేనేమో అనుకున్నా. కానీ ఎలాగోలా వీలు చూసుకుని వచ్చేశా. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అంటూ చిరంజీవి కామెంట్స్ చేయగానే పక్కనే ఉన్న సుబ్బిరామిరెడ్డి గట్టిగా నవ్వుతూ కనిపించినా చిరంజీవి మాటల వెనుక వేరే అర్ధాలు ఉన్నాయా అన్న కామెంట్స్ వినిపించాయి.

కొన్ని వారాలక్రితం సుబ్బిరామిరెడ్డి చిరంజీవి పవన్ లతో ఒకభారీ మల్టీ స్టారర్ ను ప్రకటించి మీడియాలో తెగ హడావిడి చేసారు. ఆవార్తలకు అటు పవన్ ఇటు చిరంజీవి ఎవరు స్పందించలేదు. అయితే సుబ్బిరామిరెడ్డి మాత్రం ఈమూవీ ప్రాజెక్ట్ ఖచ్చితం అన్నసంకేతాలు ఇస్తున్నారు.  

ఈ నేపధ్యంలో నిన్న చిరంజీవి సుబ్బిరామిరెడ్డి పై వేసిన జోక్ ను బట్టి చిరంజీవి సుబ్బిరామిరెడ్డి చిరూ పవన్ లతో తీయబోతున్న సినిమాను కూడా జోక్ గా తీసుకున్నాడా ? అని అనిపించడం సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: