నిన్న రాత్రి విజయవాడలో జరిగిన నారా రోహిత్ ‘రాజ చేయి వేస్తే’ ఆడియో ఫంక్షన్ లో విశిష్ట అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలకృష్ణ సినిమాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలను చూసి ప్రేక్షకులు షాక్ అయి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని కామెంట్ చేసారు.
అందువల్ల నిర్మాతలు ఇటువంటి సినిమాలు తీయడం మానుకుని ప్రేక్షకులకు జబ్బు చేసే సినిమాలను కాకుండా ప్రేక్షకులు ఆనంద పడే సినిమాలను తీయాలని పిలుపు ఇచ్చారు చంద్రబాబు. అంతేకాదు నిర్మాతలు తాము తీసే సినిమాల ద్వారా వ్యవస్థలో జీవించే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపకుండా నైతిక విలువలు పెంపొందించే సినిమాలను తీయాలని పిలుపు ఇచ్చారు చంద్రబాబు.
అయితే తన బావ బాలకృష్ణ సినిమాలు మటుకు అలా ఉండవు అని అంటూ బాలయ్య సినిమాలలో తప్పుడు సంకేతాలు లేకపోవడంతో ప్రేక్షకులు హాయిగా బాలకృష్ణ సినిమాలను చూడవచ్చు అని బాలయ్యను ఆకాశానికి ఎత్తేశాడు చంద్రబాబు. కానీ ఈరోజు విడుదల అవుతున్న కొంతమంది హీరోల సినిమాలు చూడటానికే భయమేస్తోంది అని చెపుతూ చంద్రబాబు కామెంట్స్ చేయడంతో ఆ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన చాల మంది ఆశ్చర్య పోయినట్లు టాక్.
మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మసాల సినిమాలు చేసే బాలకృష్ణ సినిమాలలో నైతిక విలువలు ఏమి ఉంటాయి అని చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తుకు చేసుకుంటూ తమలో తాము కామెంట్ చేసుకున్నట్లు టాక్. బాలకృష్ణ ఈమధ్య లేటెస్ట్ గా నటించిన ‘డిక్టేటర్’ సినిమాలో ఎంత నైతిక విలువలు ఉన్నాయో అర్ధంకాక ఈ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన వారంతా షాక్ అయ్యారని తెలుస్తోంది..