డబ్బే డబ్బు : కుప్ప కూలుతున్న పారిశ్రామిక రంగం ప్రమాదంలో ఆర్ధికవ్యవస్థ !

Seetha Sailaja
గత 6 నెలలుగా దేశాన్ని కుదిపేస్తున్న కరోనా సమస్యలతో పారిశ్రామిక ఉత్పత్తి 16.6 శాతం క్షీణత నమోదు చేసుకోవడంతో భారత ఆర్ధికవ్యవస్థ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ముఖ్యంగా తయారీ గనులు విద్యుత్ రంగాలలో భారీగా ఉత్పత్తి క్షీణించడంతో దేశంలో అనేక రంగాలలో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులకు ఉద్యోగాలుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆర్ధిక విశ్లేషకులు హెచ్చరికలు చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ ప్రభావం కొన్ని రంగాల పై ఏమాత్రం పడలేదు.


ముఖ్యంగా పర్సనల్ కేర్ వస్తువుల అమ్మకాల వృద్ధి రేటు మరింత ఎక్కువగా ఉంది. కరోనా ముప్పు నుండి ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ఎక్కువగా పర్సనల్ కేర్ వస్తువులు ఎక్కువగా కొంటూ ఉండటంతో డిటర్జెంట్ లు సర్ఫేస్ క్లీనర్ల ప్రొడక్ట్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ఆహార ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం సుమారు 6 శాతం పెరుగుదల నమోదు అయింది.


ఇలాంటి పరిస్థితులలో భారత ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నదని కోలుకోవడానికి వెంటనే మూడు చర్యలు చేపట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సూచనల పై అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దేశప్రజల జీవనోపాధికి రక్షణ కల్పించాలని ప్రత్యక్ష నగదు సహాయం ద్వారా వారికొనుగోలు శక్తిని పెంచాలి అన్న మన్మోహన్ సింగ్ సూచన ఎంతవరకు ఆచరణ యోగ్యం అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


అదేవిధంగా వ్యాపారాలకు తగిన మూలధనం అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వ పరపతి హామీ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తూ సంస్థాగత స్వయం ప్రతిపత్తిని కల్పించడం ద్వారా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ చేసిన సూచనలను ఎంతవరకు నేటి కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకు వస్తుంది అన్న విషయమై ప్రస్తుతానికి స్పష్టమైన క్లారిటీ లేదు. దీనితో ముందు చూపుతో సమర్థవంతమైన ప్రణాళికలు అనుసరించకపోతే భారత ఆర్ధిక వ్యవస్థ రానున్న రోజులలో తీవ్ర సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉందని ఆర్ధిక శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ సంక్షోభాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుంది అన్న విషయమై అన్ని వర్గాలలో ఆసక్తి పెరిగిపోతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: