సుశాంత్ ఎదురుచూపులు ఎవరి కోసమో తెలుసా.....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం ఐనా వారిలో ఒకరు సుశాంత్.ఆయన తల్లి వైపు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తాత, తండ్రివైపు తాత ప్రముఖ నిర్మాత ఏ.వి.సుబ్బారావు, మేనమామ నాగార్జున టాప్ స్టార్ – ఇలా ఎటు చూసినా, తొలి నుంచీ సినిమా రంగంతో అనుబంధం ఉన్న సుశాంత్ చిత్రసీమలో రాణించడానికి పట్టువదలని విక్రమార్కునిలాగే శ్రమిస్తున్నారు. మధ్యలో ‘చి.ల.సౌ.’ వంటి విజయం మురిపించింది. మళ్ళీ ఆ తరహా సినిమా కోసం చూస్తున్నారాయన. అలాగని హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో ‘అల…వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్ సుశాంత్ కు పరమానందం పంచింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లోనూ, మాస్ మహరాజా రవితేజ ‘రావణాసుర’లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు సుశాంత్. 

సుశాంత్ 1986 మార్చి 18న హైదరాబాద్ లో జన్మించారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత అనుమోలు వెంకటసుబ్బారావు తనయుడు అనుమోలు సత్యభూషణ రావు సుశాంత్ తండ్రి. ఏయన్నార్ రెండో కూతురు నాగసుశీల సుశాంత్ తల్లి. తన తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున, పెద్దమ్మ కొడుకు సుమంత్ నటనలో రాణించడం చూశాక సుశాంత్ మనసు సైతం సినిమా రంగంవైపు పరుగు తీసింది. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేసిన సుశాంత్ కొంతకాలం ‘యునైటెడ్ టెక్నాలజీస్’లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేశారు. తరువాత ముంబైలోని ‘క్రియేటింగ్ కేరెక్టర్స్ ట్రైనింగ్ స్కూల్’లో నటశిక్షణ తీసుకున్నారు. ‘కాళిదాసు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు సుశాంత్. ‘మహాకవి కాళిదాసు’గా నటించి మెప్పించిన అక్కినేని మనవడు ‘కాళిదాసు’గా రావడం అభిమానులకు ఆనందం కలిగించింది. తొలి చిత్రంతోనే నటునిగా మంచి మార్కులు సంపాదించారు సుశాంత్. ఈ సినిమా తరువాత “కరెంట్, అడ్డా” చిత్రాల్లోనూ హీరోగా నటించిన సుశాంత్ ‘దొంగాట’లో “బ్రేకప్ అంటూ…” అనే పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. 

‘ఆటాడుకుందాం…రా’లో హీరోగా నటించిన సుశాంత్ కు ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆనందం పంచలేదు. లో బడ్జెట్ లో తెరకెక్కించిన ‘చి.ల.సౌ.’ సుశాంత్ కు మంచి విజయాన్ని అందించింది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘చి.ల.సౌ.’ నటునిగానూ సుశాంత్ కు మంచి మార్కులు పోగేసింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.అలాగని హీరో వేషాలే వేయకుండా ఇతర హీరోల చిత్రాల్లోనూ నటిస్తున్నారు. సుశాంత్ నటించిన వెబ్ సిరీస్ ‘మా నీళ్ళ ట్యాంక్’ అలరించింది. ఏది ఏమైనా సోలోహీరోగా సుశాంత్ మరోమారు ‘చి.ల.సౌ.’ వంటి డీసెంట్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ సుశాంత్ కు ‘చి.ల.సౌ.’ రావలసి ఉంది.

ఏదేమైనా ఈ బర్త్డే తర్వాత ఐనా సరే ఆయనకు మంచి మంచి అవకాశాలు వచ్చి అవి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూన్నారు అక్కినేని అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: