అలనాటి స్టార్ఎం హీరోయిన్ ఎందరికో 'స్వప్నసుందరి'!

murali krishna
డ్రీమ్ గర్ల్’ అన్న మాట వింటే చాలు భారతీయులకు ముందుగా గుర్తుకు వచ్చే మనోహర రూపం హేమామాలినిదే!
ఈ నాటికీ ఆ నాటి హేమ అందాలను మననం చేసుకుంటూ పరవశించిపోయే రసిక శిఖామణులు ఎందరో ఉన్నారు. 74 ఏళ్ళు నిండినా, ఇప్పటికీ ఎంతో చెలాకీగా నాట్యం చేసే హేమామాలినిని చూస్తే అమృతం సేవించి, దివి నుండి భువికి దిగివచ్చిన అప్సరస అనే అనిపిస్తుంది.
తమిళనాడులోని శ్రీరంగంలో జయలక్ష్మి, చక్రవర్తి అయ్యంగార్ దంపతులకు 1948 అక్టోబర్ 16న హేమామాలిని జన్మించారు. చెన్నైలోని ఆంధ్రమహిళా సభలో తొలుత హేమామాలిని పాఠాలు నేర్చారు. తరువాత డి.టి.ఈ.ఏ. మందిర్ లో 11వ తరగతి వరకు చదువుకున్నారు. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే అభిలాషతో ఉన్నారు. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించిన హేమామాలిని తొలుత 1963లో ‘ఇదు సత్తియమ్’ చిత్రంలో “షింగారీ…” అనే పాటలో నర్తించారు. ఆ తరువాత 1965లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం ‘పాండవవనవాసము’లో “మొగలీరేకుల సిగదానా…” అనే పాటలో కనిపించారు. ఆమె అదృష్టం వల్ల తొలి హిందీ చిత్రం ‘సప్నోంకీ సౌదాగర్’లో రాజ్ కపూర్ లాంటి మేటి నటునితో నటించారు. ఆ సినిమాతోనే ‘డ్రీమ్ గర్ల్’ అన్న పేరు సంపాదించారు హేమామాలిని.
అప్పటి స్టైలిష్ హీరో దేవానంద్ తో ‘జానీ మేరా నామ్’లో నటించారు హేమ. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో తరువాత దేవానంద్ తో కలసి “తేరే మేరే సప్నే, జోషీలా, చుప్పా రుస్తుమ్, షరీఫ్ బద్మాష్, అమిరీ గరీబ్, జానేమన్, సచ్చే కా బోల్ బాలా, అమన్ కే ఫరిస్తే” వంటి చిత్రాలలో హేమామాలిని అభినయించారు. ధర్మేంద్రతో హేమామాలిని కలసి “తుమ్ హసీన్ మై జవాన్, షరాఫత్, నయా జమానా, రాజా జానీ, సీతా ఔర్ గీతా, పత్తర్ ఔర్ పాయల్, దోస్త్, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, ఆజాద్, దిల్లగీ, ఆలీబాబా చాలిస్ చోర్, బఘావత్, సమ్రాట్, రజియా సుల్తాన్, రాజ్ తిలక్” వంటి చిత్రాలలో నటించారు. వీరిద్దరి జోడీని జనం మెచ్చారు. వారు కూడా ఒకరికి ఒకరు నచ్చారు. దాంతో 1980లోధర్మేంద్రను పెళ్ళాడారు హేమామాలిని.
ఇతర హీరోలతోనూ హేమామాలిని సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. “సన్యాసీ, దస్ నంబరీ, ధర్మాత్మ, అందాజ్, ప్రేమ్ నగర్, మెహబూబా, క్రాంతి, నసీబ్, సత్తే పే సత్తా, బాఘ్ బన్” వంటి విజయవంతమైన చిత్రాలలో హేమామాలిని వయసుకు తగ్గ పాత్రల్లో మురిపించారు. కొన్ని చిత్రాలలో హేమామాలిని అందం మందంగానే బంధం వేసింది. హేమామాలిని, ధర్మేంద్ర దంపతులకు ఇషా డియోల్, అహనా డియోల్ ఇద్దరు కూతుళ్ళు. ఆమె కూతుళ్ళతో కలసి అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటికీ తన నృత్యాభినయంతో అలరిస్తూనే ఉన్నారు. దేశవిదేశాల్లోని అభిమానులను తన నర్తనంతో ఆకట్టుకున్నారామె. తెలుగులో యన్టీఆర్ ‘శ్రీకృష్ణవిజయం’లోనూ “జోహారు శిఖిపింఛమౌళీ…” పాటలో నృత్యం చేశారు. ఇక బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో గౌతమిగా నటించారు.
హేమామాలిని 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2009 దాకా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారామె. 2011లో బీజేపీ జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014లో మధుర లోక్ సభ స్థానం నుండి ఎమ్.పి.గా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుండి 2019లో మరోమారు గెలుపొందారు. భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన హేమామాలినికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంతో భక్తి. ఆమె ఇస్కాన్ జీవిత సభ్యురాలు. తన నృత్యంలో ఎక్కువగా కృష్ణ భక్తి గీతాలకే ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఏదేమైనా, అసలు సిసలు ‘డ్రీమ్ గర్ల్’ అనిపించుకున్న హేమామాలిని మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: