గీత మూవీ రివ్యూ హేబా పటేల్ సునీల్

murali krishna
బ్బా పటేల్ కు మొదటి నుండి గ్లామర్ డాల్ గానే పేరుంది. అయితే ఇటీవల వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’లో తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను చేసి ఆమె మెప్పించింది.
అదే తరహాలో శుక్రవారం జనం ముందుకు వచ్చిన ‘గీత’ మూవీలోనూ హెబ్బా అవుటాఫ్ ద బాక్స్ క్యారెక్టర్ చేసింది. ‘మ్యూట్ విట్నెస్’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ఏమేరకు సఫలమైందో తెలుసుకుందాం.
గీత (హెబ్బా పటేల్) ఓ అనాథ. చిన్నప్పుడే ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. అదే సమయంలో ఆమె కూడా మూగదైపోతుంది. అనాధ ఆశ్రమంలో పెరిగి పెద్దైన గీత… తన లాంటి అనాధలను చేరదీసి వారి ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటుంది. ఆమె గొప్పతనాన్ని గుర్తించి, గౌతమ్ (రామ్ కార్తీక్) ఆమెతో ప్రేమలో పడతాడు. సమాజంలో పెద్దమనిషిలా చెలామణి అవుతున్న భగవాన్ (సాయికిరణ్‌) అక్రమాలను బయటపెట్టే క్రమంలో గౌతమ్ ప్రాణాలు కోల్పోతాడు. అనాధల జీవితాలతో ఆడుకుంటున్న భగవాన్ గుట్టు రట్టు చేయడానికి గీత పోలీస్ ఆఫీసర్ (సునీల్) సాయం కోరుతుంది. సమాజంలో అక్రమాలను ఎండకట్టడానికి ఒంటరి పోరాటం చేసిన గీతకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? పోలీసుల నుండి ఆమెకు ఎలాంటి సాయం లభించింది? భగవాన్ నిజ స్వరూపాన్ని బయట పడిందా.. లేదా!? అనేది మిగతా కథ.
హెబ్బా పటేల్ తన ఇమేజ్ చట్రం నుండి పూర్తిగా బయటకు వచ్చి చేసిన చిత్రమిది. ఈ తరం కుర్రకారు హెబ్బా ను మూగ అమ్మాయి పాత్రలో యాక్సెప్ట్ చేయడం కష్టమే. పాత్రోచితంగా ఇందులో హెబ్బా పోరాట సన్నివేశాల్లోనూ నటించింది. నటిగా ఆమెకు ఇది చెప్పుకోదగ్గ చిత్రమే అయినా, సినిమా విజయానికి ఈ పాత్ర ఏ మాత్రం దోహద పడదు. గత రెండేళ్ళుగా సునీల్ మీడియం బడ్జెట్ మూవీస్ లో రకరకాల పాత్రలు చేస్తున్నాడు. అందులో అత్యధికంగా పోషించింది పోలీసు పాత్రలే. ఇందులోనూ అలాంటిదే చేశాడు. సో… అతని నుండి గొప్ప నటన ఏదీ ఎక్స్ పెక్ట్ చేయలేం. అయితే క్లయిమాక్స్ లోని ట్విస్ట్ కొంత ఆసక్తిని కలిగిస్తుంది. హెబ్బా పటేల్ సరసన రామ్ కార్తీక్ కనిపించేది కాసేపే అయినా… అతని నటన బాగుంది. వీరిద్దరూ విడుదల కావాల్సి ఉన్న ‘తెలిసిన వాళ్ళు’ సినిమాలోనూ కలిసి నటించారు. ‘గీత’ మూవీకి సంబంధించి చెప్పుకోవాల్సిన ప్రధానాంశం సాయి కిరణ్‌ విలనిజం. ఇంతవరకూ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసి మెప్పించిన సాయి కిరణ్ ఇందులో మొదటిసారి విలన్ గా నటించాడు. కొన్నేళ్ళుగా బుల్లితెరకే పరిమితం అయిపోయిన అతను ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అవకాశం ఇస్తే, తాను ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనని సాయికిరణ్ చెప్పకనే చెప్పాడు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను భరణి, సప్తగిరి, సూర్య, సంధ్యాజనక్, రాజీవ్కనకాల, పృథ్వి, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు పోషించారు.
సుభాష్‌ ఆనంద్ అందించిన స్వరాలకంటే చిన్నా రీ-రికార్డింగ్ బాగుంది. ఇందులోని పాటలను సాగర్ రాశారు. క్రాంతికుమార్ సినిమాటోగ్రఫీ ఓకే! వినాయక్ శిష్యుడు విశ్వను దర్శకుడిగా పరిచయం చేస్తూ, పరిమితమైన బడ్జెట్ లో ఆర్. రాచయ్య దీనిని నిర్మించారు. ఆ లోటు తెర మీద కనిపిస్తోంది. చెప్పాలనుకున్న అంశం మంచిదే అయినా, దాన్ని ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ విశ్వ తడబడ్డాడు. కీలకమైన సన్నివేశాలు సైతం పేలవంగా ఉన్నాయి. ఈ ‘గీత’ నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో ఏ ఒక్కరి తలరాతను మార్చేది కాదు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: