బిగ్ బాస్ (తెలుగు) రివ్యూ: గీతక్క గెస్సింగ్ గోల్మాల్ అయింది....!!

murali krishna
బ్యాటరీ గేమ్ మూడో రోజు కూడా కొనసాగింది. కొందరికి న్యాయం జరిగింది. ఇంకొందరికి నిరాశ మిగిలింది. కొందరికి సంతోషమేసింది. మరికొందరిలో దు:ఖం పొంగింది.మొత్తంగా సర్‌ప్రైజ్‌లు, ఫోన్లు, గిఫ్టులు అంటూ ఇల్లంతా ఎమోషన్స్తో నిండిపోయింది.
వాసంతి నో.. రోహిత్ ఎస్
బాలాదిత్య వల్ల ఖాళీ అయిపోయిన బ్యాటరీని నింపడానికి పెద్ద పరీక్షే పెట్టాడు బిగ్‌బాస్. వాసంతి, రోహిత్‌లలో ఎవరో ఒకరు రానున్న రెండు వారాలకు డైరెక్ట్గా నామినేట్ అయితే.. బ్యాటరీని వంద శాతం చార్జ్ చేసేస్తానన్నాడు. దాంతో వాసంతి, రోహిత్‌ డైలమాలో పడ్డారు. పోయినవారం కూడా తాను త్యాగం చేశాను కాబట్టి మరోసారి చేయలేనంది వాసంతి. ఇలా నన్ను నేను నామినేట్ చేసుకుంటూ పోతే ఇకమేం నిన్ను ఓట్లేసి కాపాడటం ఎందుకని ఆడియెన్స్ అనుకుంటారు, సో రిస్క్ తీసుకోలేను అంది. రోహిత్‌ పెద్దగా వాదించకుండానే తాను నామినేట్ అవుతానని చెప్పేశాడు.అయితే మధ్యలో మెరీనా వచ్చి ఏదో సర్ది చెప్పబోయింది. కానీ వాసంతి ఒప్పుకోలేదు. రోహిత్ తప్పుకోలేదు. దాంతో అతను రెండు వారాలకు నామినేట్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత మాత్రం అతను చాలా డల్ అయిపోయాడు. అందరూ స్వార్థపరులే అంటూ బాధపడ్డాడు. పర్లేదులే, మనకి తెలుసు కదా అంటూ మెరీనా కూల్ చేసింది. కానీ అతను దిగులుగా కూర్చుండిపోయాడు. అయితే అతను చేసిన త్యాగం ఫలితంగా చాలామందికి సర్‌ప్రైజ్‌లు దక్కాయి. ఆ విషయంలో అతనికి అందరూ థ్యాంక్స్ చెప్పాల్సిందే.కొంత ఇష్టం.. కొంత కష్టం
బాలాదిత్య నిన్న తన భార్య, కూతురితో మాట్లాడుకున్నాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు. బెంగని తట్టుకోలేక ఏడ్చేశాడు. అయితే ఆ తర్వాత కూడా ఆ బాధ అతనిని వెంటాడింది. తనవాళ్లతో మాట్లాడిన సంతోషాన్ని ఎంజాయ్ చేయలేకపోయాడు. తాను ఎక్కువ బ్యాటరీని వాడేసుకుని మిగతావాళ్లకి అన్యాయం చేశానేమోనని తెగ ఫీలయ్యాడు. అలాంటిదేం లేదని కొందరు ఓదార్చారు. కొందరేమో అలా చేశాడేంటి అంటూ రహస్యంగా ఆడిపోసుకున్నారు.కీర్తి కూడా బాగా డిజప్పాయింట్ అయ్యింది. ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేసింది. బాగ్‌బాస్ ఇంకేదో ఆఫర్ చేశాడు. అవి రెండూ తనకి పెద్ద ఇంపార్టెంట్ కాకపోవడంతో నేనేం చేసుకోను వీటిని అంటూ గుక్కపెట్టింది. ఆమెకి ధైర్యం చెబుతూ మానస్‌ పంపిన మెసేజ్ విని కాస్త రిలాక్సయ్యింది. కానీ నిరాశ కలిగించిన బాధ మాత్రం తగ్గినట్టు లేదు. రేవంత్‌కి కూడా ఇలాగే అయ్యింది. అతనికి అసలు ఫోన్ కాల్ ఆప్షనే ఇవ్వలేదు బిగ్‌బాస్.నువ్వు పంపిన సారె నీ భార్య అందుకుంటున్న వీడియో కావాలా ? ఆమె ఫొటో కావాలా ? అని అడిగాడు. వీడియో అయితే ఒక్కసారితో పోతుంది, ఫొటో అయితే దగ్గర పెట్టుకోవచ్చు కదా అని దాన్ని ఎంచుకున్నాడు రేవంత్. అయితే ఆ తర్వాత చాలా ఏడ్చాడు. ఒక్కసారి నా భార్యని చూసుకుని ఉంటే బాగుండేది అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఫైమాకి మాత్రం వాళ్లమ్మతో వీడియో కాల్ మాట్లాడే చాన్స్ దక్కింది. వాసంతికి మేనకోడలి ఫొటో వచ్చింది. రాజ్‌కి ఆడియో కాల్‌ అవకాశం వచ్చింది.సూర్యా.. ఇక ఆపవా!
ఆటలోనైనా కాంప్రమైజ్ అవుతాడేమో కానీ కెమెరాల ముందు ఏకపాత్రాభినయం చేయడంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడు సూర్య. ఇంట్లోవాళ్ల మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. ఇలా ఒంటరిగా ఒకచోట బందీ అయినట్టు ఉంటున్నప్పుడు తమ వాళ్లతో మాట్లాడుకోవాలని ఆశ అందరికీ కలుగుతుంది. హౌస్‌మేట్స్ అందరూ దాదాపు అదే స్థితిలో ఉన్నారు. అయితే వాళ్లంతా నార్మల్‌గా ఉన్నారు. సూర్య మాత్రం ఓ రేంజ్‌లో అతి చేశాడు.బేసిగ్గా అతనికి కెమెరాల ముందు ప్రతిభను ప్రదర్శించడం బాగా అలవాటు. ఈ ఎమోషనల్ టాస్క్ మొదలైనప్పటి నుంచి దాన్ని మరింత పెంచాడు. అతనొక్కడికే ఫీలింగ్ ఉన్నట్టు ఒకటే శోకాలు పెట్టాడు. మూడు రోజుల పాటు నెత్తిమీద ఉన్న నీళ్లకుండకి చిల్లు పెడుతూనే ఉన్నాడు. పైగా రాత్రి అందరూ పడుకున్నప్పుడు ఫోన్ బూత్‌లో దూరి, రిసీవర్ చేత్తో పట్టుకుని అమ్మతో మాట్లాడుతున్నట్టు అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశాడు.
తీరా అమ్మతో మాట్లాడే చాన్స్ వచ్చినప్పుడు పక్కవాళ్లకి కూడా అవకాశం ఇవ్వాలి అంటూ ఫోన్ కాల్ వదిలేసి లెటర్ ఆప్షన్ ఎంచుకుని త్యాగమూర్తిలా బిల్డప్ ఇచ్చాడు. అమ్మాయిలతో కథలు నడిపించడం మానేసి ఈ రేంజ్ పర్‌ఫార్మెన్స్ టాస్కుల్లో చూపిస్తే మరింత బాగా రాణించే చాన్స్ ఉంటుంది కదా!
ఇదేం గోల ఇనయా!
సూర్య, ఆరోహిల మధ్య నడిచిన ట్రాక్ గురించి మామూలుగా రచ్చ అవ్వలేదు. బయట జనం నానా మాటలూ అన్నారు. షో అశ్లీలంగా తయారయ్యింది అంటూ కొందరు కేసులు కూడా వేశారు. ఆ కారణంగానే అంతకంటే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నా ఆరోహిని ఎలిమినేట్ చేసేశారనే టాక్ కూడా ఉంది. కారణం ఏదైనా ఆమె వెళ్లిపోయాక హమ్మయ్య అనుకున్నారు చాలామంది ప్రేక్షకులు. కానీ ఆమె ప్లేస్‌లోకి ఇప్పుడు ఇనయా వచ్చింది.సూర్య అంటే క్రష్ అంటూ కన్ఫెషన్ రూమ్‌లో తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్న ఇనయా.. ఇప్పుడు సూర్యతో ప్రతి నిమిషాన్నీ షేర్ చేసుకుంటోంది. ఆరోహిని మించి ఇనయా ట్రాక్ తలనొప్పిగా తయారయ్యిందనడంలో సందేహమే లేదు. ప్రతిక్షణం ఆమె అతనితోనే ఉంటోంది. వేరేవాళ్లు అతని దగ్గరకు వస్తున్నా వాళ్లని తోసుకుని మరీ ముందుకెళ్లిపోయి పక్కన నిలబడుతోంది. ఒకవేళ అతనికి దూరంగా ఉన్నా ఆమె కళ్లు అతని మీదే ఉంటున్నాయి.ఇక ఇద్దరూ ఎప్పుడు చూసినా పడుకుని తెగ కబుర్లాడుకుంటున్నారు. అతనేమో అస్తమానం ఏడుస్తుంటాడు. ఈమె మాటిమాటికీ ఓదారుస్తుంటుంది. ఇవాళ కాస్త లిమిట్ దాటి తాను తింటోన్న లాలీపాప్‌ను అతని నోటికి కూడా అందించింది. సూర్య ఆట మీద కంటే అమ్మాయిలతో స్నేహం చేయడం మీదే ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాడని ఇప్పటికే అందరూ అంటున్నారు. మొన్నటి వరకు ఆటని వేటలా భావించిన ఇనయా కూడా ఇప్పుడు అతని మీద దృష్టి పెట్టి గేమ్‌ని పక్కన పెట్టేస్తోందనిపిస్తోంది. మరి దీని ఫలితం ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.ఎట్టకేలకి టాస్క్ పూర్తయ్యింది. కచ్చితంగా వీళ్లకే చాన్స్ వస్తుందంటూ గీతక్క రివ్యూ మొదలెట్టింది. అయితే ఆమె గెస్సింగ్ గోల్‌మాల్ అయ్యింది. బిగ్‌బాస్ ఎవరి పేర్లూ చెప్పకుండా అందరినీ పోటీదారులుగా ప్రకటించాడు. ఓ టాస్క్ పెడతానని, అందులో గెలిచిన ఎనిమిది మంది కెప్టెన్సీ కోసం పోటీ పడతారని చెప్పాడు. కొన్ని బుట్టలు పెట్టాడు. ఎనిమిది బంతులూ పెట్టాడు. బజర్ మోగగానే అందరూ పరిగెత్తుకుపోయి, బంతిని అందిపుచ్చుకుని తమ పేరున్న బుట్టలో పెట్టేయాలి. ఏ ఎనిమిది మంది అలా పెడతారో వాళ్లే కెప్టెన్సీ పోటీకి అర్హులవుతారు.టాస్క్ చూడ్డానికి సింపుల్‌గా అనిపించినా బరిలోకి దిగాక తాట లేచిపోయింది. కొందరు ఈజీగా బంతిని పట్టుకుపోయారు. కానీ ఒకట్రెండు బంతుల కోసం మాత్రం వీర లెవెల్లో యుద్ధం జరిగింది. గీతూకి చేయి తెగింది. మెరీనా ప్రెషర్ తట్టుకోలేక ఆయాసపడి ఏడ్చేసింది. చాలాసేపు పెనుగులాడిన తర్వాత కొందరు పై చేయి సాధించారు. చివరికి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్‌, అర్జున్, రోహిత్‌లు కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు.ఇక రేపు ఉంటుంది అసలు సిసలు పోటీ. దాదాపు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు. కాబట్టి కాంపిటీషన్ గట్టిగానే ఉండబోతోంది. మరి టాస్కులో ఎవరు గెలుపు సాధిస్తారో, కెప్టెన్ కుర్చీని అధిరోహిస్తారో! చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: