సంక్రాంతి సినిమా క‌ళ త‌ప్పిన‌ట్టే..?

             కోవిడ్ వైర‌స్ దెబ్బ‌కు వ‌రుస‌గా రెండో ఏడాది సంక్రాంతి సినిమా క‌ళ త‌ప్పింది. ముందునుంచీ భ‌య‌ప‌డుతూ వ‌చ్చిన‌ట్టుగానే ప‌రిస్థితులు అంత‌కంత‌కూ క్లిష్ట‌త‌రంగా ప‌రిణ‌మించ‌డంతో ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా ప‌డ‌టం, ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన రాధేశ్యామ్ చిత్రం కూడా ఇదే బాట‌లో న‌డిచే అవ‌కాశం ఉండ‌టంతో ఈ సంక్రాంతి కూడా భారీ చిత్రాలు లేకుండానే గ‌డ‌చిపోనుంద‌న్న‌మాట‌. క‌రోనా ప్ర‌భావం మొద‌లైంది మొదలు నెల‌ల త‌ర‌బ‌డి మూత‌ప‌డిన‌ థియేట‌ర్ల‌కు ఈ సీజ‌న్ లో వ‌చ్చేందుకు సిద్ధ‌మైన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల‌తో పున‌ర్వైభ‌వం త‌థ్య‌మ‌ని గ‌ట్టి ఆశ‌లు పెట్టుకున్న ప‌రిశ్ర‌మ‌కు ఇది ఆశ‌నిపాత‌మే. ఈ నేప‌థ్యంలో సంక్రాంతి బ‌రిలో మిగిలిన చెప్పుకోద‌గిన చిత్రంగా తండ్రీకొడుకులు నాగార్జున‌, నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న బంగార్రాజు మాత్ర‌మే నిలిచే అవ‌కాశ‌ముంది. కోవిడ్‌ ప‌రిస్థితి మ‌రీ అధ్వానంగా మార‌కుంటే ఈ సినిమాకు ఈ ప‌రిణామాలు క‌లిసివచ్చే అవ‌కాశ‌ముంది. సినిమా బాగుంటే మంచి హిట్ అక్కినేని హీరోల ఖాతాలో చేరొచ్చు.

 
             వాస్త‌వానికి సంక్రాంతి పండుగ‌ సినిమాల విడుద‌ల‌కు పెద్ద సీజ‌న్‌. ద‌శాబ్దాలుగా వ‌స్తున్న ఆన‌వాయితీ ఇది. పంట‌లు చేతికంది ప్ర‌జ‌ల‌ చేతిలో కాసులుండ‌టం, కొత్త సంవ‌త్స‌రం ఉత్సాహం కొన‌సాగే స‌మ‌యం కార‌ణంగా  స్టార్ హీరోల చిత్రాలు ఈ స‌మ‌యంలో పోటా పోటీగా విడుద‌ల‌వుతుంటాయి. బొమ్మ‌లో స‌త్తా ఉండాలే ఎన్ని సినిమాలు వ‌చ్చినా అన్నిటికీ కాసులు పంచ‌గ‌ల‌గ‌డం సంక్రాంతి సీజ‌న్ ప్ర‌త్యేక‌త‌. కానీ కోవిడ్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఈ ఏడాదీ బ‌లికావ‌డం స్టార్ హీరోల అభిమానుల‌ను మాత్ర‌మే కాక‌ చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను కూడా తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చే అంశ‌మే. ఇప్ప‌టికే ప‌వ‌న్ భీమ్లానాయ‌క్‌, మ‌హేష్ స‌ర్కారువారి పాట వెన‌క్కు వెళ్ల‌గా మ‌ళ్లీ ఈ నాలుగు చిత్రాల విడుద‌ల‌కు కంఫ‌ర్ట్ టైమ్ ఎంచుకోవ‌డం నిర్మాత‌ల‌కు పెద్ద స‌వాలే. అంతేకాక భారీ చిత్రాలు కావ‌డంతో సినిమాలు లేట‌య్యేకొద్దీ నిర్మాత‌ల‌పై పెనుభారం ప‌డుతుంది. ఇక చిన్న చిత్రాల‌కు మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ మంచి వేదిక‌గా మార‌డంతో అవ‌న్నీ సేఫ్‌జోన్ లోనే ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: