ఆకట్టుకుంటున్న శర్వానంద్ కొత్త సినిమా పోస్టర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ హీరో ఆ తర్వాత కాలంలో సినిమాల్లో హీరోగా నటిస్తూ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఆ తర్వాత మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయాలతో డీలా పడిపోయాడు.  ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే ఎంతో అంచనాలతో థియేటర్లలో విడుదల చేసిన మహా సముద్రం సినిమా కూడా శర్వానంద్ కు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న విజయాన్ని తెచ్చి పెట్టలేదు. ఇది ఇలా ఉంటే శర్వానంద్ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 30 వ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

 శర్వానంద్ 30 సినిమాగా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర బృందం తాజాగా బయటకు వదిలింది. చిత్ర బృందం బయటకు వదిలిన ఈ పోస్టర్ లో అక్కినేని అమల గోడపై కూర్చుని ఉన్నారు. శర్వానంద్, అతని తమ్ముడు అమ్మ ఒడిలో తల పెట్టుకుని అలా సేద తీరుతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ కు జంటగా రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: