బాక్సాఫీసు వద్ద ఘ‌ర్జించ‌ని మృగ‌రాజు

మెగాస్టార్ చిరంజీవి - యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌య్య సినిమాలు సంక్రాంతి సీజ‌న్లో పోటీ ప‌డితే అభిమానుల్లో ఆ కిక్కేవేరు. ఈ పోటీలో కొన్నిసార్లు చిరంజీవి పై చేయి సాధిస్తే మ‌రికొన్నిసార్లు బాల‌య్య సినిమాలు ప్రేక్ష‌కులను మెప్పించాయి. 2001లో ఇలా సంక్రాంతి సీజ‌న్లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన మెగా స్టార్ చిత్రం మృగ‌రాజు. తెలుగుతెర‌కు భారీ చిత్రాలను అందించిన‌ దేవీవ‌ర‌ప్ర‌సాద్ దీనికి నిర్మాత‌. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కుడు. మెగాస్టార్ స‌ర‌స‌న అప్ప‌టికి టాప్ ఫామ్‌లో ఉన్న సిమ్రాన్ క‌థానాయిక‌. దేవీవ‌ర‌ప్ర‌సాద్ నిర్మాణ సంస్థ‌లోనే ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు- చిరు కాంబోలో అంత‌కు ద‌శాబ్ద‌కాలం ముందు వ‌చ్చిన ఘ‌రానామెగుడు చిత్రం బాక్సాఫీసు రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే రూ. 10 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అధిగ‌మించిన తొలి చిత్ర‌మిది. ఈ నేప‌థ్యంలోనే మృగ‌రాజు విడుద‌ల‌కు ముందు జ‌రిగిన ప్ర‌చార హంగామాతో చిత్రంపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి 2001 జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ భారీ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో మాత్రం ఘోరంగా విఫ‌ల‌మైంది.
 
హాలీవుడ్ చిత్రం ది గోస్ట్ ఇన్ ది డార్క్‌నెస్ ఆధారంగా, తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని జోడించిన మ‌సాలాల‌తో రూపొందిన మృగ‌రాజు చిత్రం డిజాస్ట‌ర్‌గా మిగ‌ల‌డానికి ద‌ర్శ‌కుడి అనుభ‌వ రాహిత్య‌మే ప్ర‌ధానమ‌ని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్‌ చేసే గొప్ప అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న గుణ‌శేఖ‌ర్ చిరంజీవి న‌ట‌న‌ను ఉప‌యోగించుకునేలా, ఆయ‌న‌ ఇమేజ్‌కు త‌గిన‌విధంగా స‌న్నివేశాలు రూపొందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. చిరంజీవి ఈ చిత్రంలో ఓ గిరిజ‌న యువ‌కుడిగా క‌నిపిస్తాడు. ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఓ రైలు బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న‌వారిపై ఓ సింహం దాడి చేస్తుంటుంది. ఈ ప్రాజెక్టు సైట్ ఇంజ‌నీర్‌గా క‌థానాయిక సిమ్రాన్ వ‌స్తుంది. వీరికి సాయం చేసేందుకు వేట‌లో నైపుణ్య‌మున్న గిరిజ‌న యువ‌కుడైన‌ హీరో వ‌స్తాడు. అక్క‌డినుంచి ప‌లు మ‌లుపుల‌తో చిత్రం సాగుతుంది. ద‌క్షిణాఫ్రికా అడ‌వుల్లో సింహంతో మెగాస్టార్ చిరంజీవి చేసే పోరాటాలు, గ్రాఫిక్స్ త‌ప్ప.. సినిమా క‌థ‌, క‌థ‌నంలో ప‌ట్టు,  ఆక‌ట్టుకునే స్క్రీన్‌ప్లే లేక‌పోవ‌డం ఈ చిత్రంలో ప్ర‌ధాన లోపం. దీంతో చిరంజీవి వీరాభిమానులను సైతం ఈ చిత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇదే స‌మ‌యంలో దీనికి పోటీగా విడుద‌లైన బాల‌కృష్ణ న‌ర‌సింహ‌నాయుడు ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచే స్థాయి విజ‌యం సాధించ‌డంతో మృగ‌రాజు ఆ చిత్రం ముందు తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: