హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అనిల్ ‘దూకుడు’..కలిసొస్తుందా?

అనిల్ కుమార్ యాదవ్....అధికార వైసీపీలో ఓ చిచ్చరపిడుగు అని చెప్పొచ్చు. ఫైర్ బ్రాండ్ లెక్క...జగన్ అంటే ప్రాణమిచ్చే నాయకుడు. అందుకే జగన్ క్యాబినెట్‌లో కీలకమైన జలవనరుల శాఖ అనిల్‌కే దక్కింది. ఇక మంత్రిగా అనిల్ దూకుడు ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఈ దూకుడు ప్రతిపక్షంపై ఉంది తప్ప, పనితీరులో లేదనే విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ రెండున్నర ఏళ్లలో జలవనరుల శాఖ మంత్రిగా ఏ మేర సత్తా చాటారో తెలియదు గానీ, అధికార పార్టీ నాయకుడుగా, ప్రతిపక్షంపై ఫైర్ అవ్వడంలో ముందున్నారని చెప్పొచ్చు. తమ అధినేత జగన్‌పై ఈగ వాలనివ్వకుండా చూసుకుంటారు.
అయితే మంత్రిగా కాస్త వెనుకబడినట్లే తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనుల్లో  పురోగతి బాగా ఉందని చెబుతారు గానీ, అనుకున్న మేర లేదని అర్ధమవుతుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో మైనస్ ఎక్కువగానే ఉంది. అలాగే తన శాఖపై పూర్తిగా పట్టు తెచ్చుకోవడంలో కూడా వెనుకబడినట్లే తెలుస్తోంది. ఇక సొంతంగా అధికారులతో సమీక్షా సమావేశాలు జరపడం తక్కువ. కేబినెట్‌ సమావేశానికి, సాగునీటిపై సీఎం నిర్వహించే సమీక్ష సమావేశాలకు మాత్రం హాజరవుతుంటారు. అయితే ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపించడంలో అనిల్ ఫస్ట్ ఉన్నారు.
మంత్రిగా పక్కనబెడితే ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో బాగానే పనిచేస్తున్నారా? అంటే పర్లేదు బాగానే చేస్తున్నారని చెప్పొచ్చు. నెల్లూరు నగరంలో బాగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు సంక్షేమ పథకాలు అమలు బాగుంది. కాకపోతే మంత్రి కావడంతో నెల్లూరు ప్రజలు..అనిల్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలకు తగ్గట్టు మాత్రం అనిల్ పనితీరు ఉన్నట్లు కనిపించడం లేదు.
రాజకీయంగా చూస్తే సిటీలో అనిల్ బలంగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు సత్తా చాటుతూ వస్తున్న అనిల్‌కు నియోజకవర్గంలో తిరుగులేదు. పైగా తాజాగా జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలో వైసీపీ అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. సొంత పార్టీ నేతలు కొందరు సహకరించకపోయినా సరే, అన్నీ తానై చూసుకుంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. మొత్తానికైతే అనిల్ దూకుడే బాగా కలిసొచ్చేలా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: