హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సురేష్ రిజల్ట్...పాస్ ఆర్ ఫెయిల్?

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...ఈయన మంత్రి అనే సంగతి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ముఖ్యంగా విద్యార్ధులకు బాగా తెలుసు. ఎందుకంటే ఈయనే పదో తరగతి నుంచి ఫార్మసీ వరకు ఏ పరీక్ష ఫలితాలనైనా విడుదల చేస్తారు. ఫలితాలు విడుదల చేస్తారు కాబట్టే...ఈయన విద్యాశాఖ మంత్రి అని అందరికి తెలిసింది. అయితే విద్యాశాఖ మంత్రిగా సురేష్ పనితీరు ఎలా ఉందనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే..జగన్ చెప్పింది చెప్పడమే మంత్రిగారి పని అనే విమర్శలు ఉన్నాయి.
అంతకుమించి ఈయన విద్యా శాఖలో అద్భుతమైన మార్పులు చేయలేదని తెలుస్తోంది. ఇక ప్రభుత్వ కార్యక్రమాలే మంత్రికి ప్లస్ అవుతున్నాయి. నాడు-నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి అవ్వడం గానీ, జగనన్న అమ్మఒడి కావొచ్చు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఇలా ప్రతి పథకం విద్యా శాఖకు కలిసొస్తుంది. అయితే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి...ఎలాంటి సమస్యలు ఉన్నాయి..ఇంకేమైనా మార్పులు చేయాలనే అంశాలపై ఆదిమూలపుకు పెద్దగా అవగాహన లేదనే విమర్శలు ఉన్నాయి. ఎయిడెడ్ స్కూల్స్ వివాదం, ఇంగ్లీష్ మీడియం అంశం, తెలుగు అకాడమీ వివాదం కావొచ్చు...ఇలా విద్యా శాఖకు సంబంధించి పలు వివాదాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే సురేష్ విద్యా శాఖ మంత్రిగా నిమిత్తమాత్రులే అని తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్యేగా వస్తే ఈయన ప్రస్తుతం యర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సురేష్ ఇండియన్ రైల్వే ఉద్యోగాన్ని వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి యర్రగొండపాలెం నుంచి గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి మళ్ళీ యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మూడుసార్లు గెలిచిన సురేష్‌ని జగన్ క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే మంత్రిగా ఉండటంతో నియోజకవర్గానికి అందుబాటులో ఉండటం కాస్త తగ్గిందని తెలుస్తోంది. అలాగే ఇక్కడ ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలు యథావిధిగానే జరిగిపోతున్నాయి. విద్యాశాఖ మంత్రి కావడంతో...యర్రగొండపాలెంలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగాయి. కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణం. ఇక ఇక్కడ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది...అలాగే కొన్నిచోట్ల రోడ్ల పరిస్తితి బాగోలేదు. మొత్తం మీద చూసుకుంటే ఎమ్మెల్యేగా సురేష్‌కు పాస్ మార్కులు పడుతున్నట్లే తెలుస్తోంది.
రాజకీయంగా చూసుకుంటే యర్రగొండపాలెంలో సురేష్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అటు టీడీపీ ఇంచార్జ్‌గా ఎరిక్షన్ బాబు ఉన్నారు. ఇటీవలే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కూడా ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అయితే యర్రగొండపాలెం వైసీపీకి కంచుకోటగా ఉంది కాబట్టి, ఇక్కడ సురేష్‌కు చెక్ పెట్టడం అంత సులువు కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: