హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజప్ప సీన్ అయిపోయినట్లేనా...

గత ఎన్నికల్లో జగన్ గాలిని ఎదురుకుని సత్తా చాటిన కొందరు టి‌డి‌పి ఎమ్మెల్యేల పరిస్తితి ఇప్పుడు దారుణంగా తయారైనట్లు కనిపిస్తోంది. వరుసగా పంచాయితీ, మున్సిపాలిటీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో కూడా టి‌డి‌పి తేలిపోయింది. టి‌డి‌పి సిట్టింగ్ సీట్లలో కూడా దారుణమైన ఓటములని చవిచూసింది. ఈ క్రమంలోనే పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు ఘోర పరాభవం తప్పలేదు. 2014 ఎన్నికల్లో  తొలిసారి టి‌డి‌పి తరుపున పెద్దాపురం నుంచి నిలబడిన రాజప్ప అద్భుతమైన విజయం సాధించారు.


ఎమ్మెల్యేగా గెలిచిన రాజప్పకు చంద్రబాబు హోమ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. మంత్రిగా విఫలమైన, ఎమ్మెల్యేగా పర్వాలేదనిపించడంతో  2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే పెద్దాపురంలో మాత్రం రాజప్ప విజయం సాధించారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రాజప్ప సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటంలో విఫలమవుతున్నారు.
అలాగే అప్పుడప్పుడు మాత్రమే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న దవులూరి దొరబాబు దూకుడుగా పనిచేస్తున్నారు.  ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీకి బాగా ప్లస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో వైసీపీకి లీడ్ పెరిగినట్లు కనిపిస్తోంది.
పైగా పెద్దాపురంలో రాజప్ప ఓడిపోవడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు...వరుసపెట్టి పంచాయితీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోలేకపోయారు. అలాగే పెద్దాపురం మున్సిపాలిటీలో టి‌డి‌పి ఘోరంగా ఓడిపోయింది.  ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో అయితే చిత్తుగా ఓడింది. కాబట్టి ఇప్పటినుంచైనా చినరాజప్ప తన పనితీరు మెరుగుపర్చుకోవాల్సి ఉంది. ప్రజల్లో తిరగాలి. వైసీపీ లీడ్ తగ్గించాలి.
అలా కాకుండా సైలెంట్‌గా ఉంటే నెక్స్ట్ గెలవడం కష్టమే. ఇప్పటికే జగన్ దెబ్బకు ప్రతి నియోజకవర్గంలో టి‌డి‌పికి చుక్కలు కనిపిస్తున్నాయి. కనీసం సిట్టింగ్ సీటులో సత్తా చాటకపోతే ఇంకా పార్టీ మనుగడకే కష్టం. మరి పరిస్తితులు చూస్తుంటే నెక్స్ట్ పెద్దాపురం నియోజకవర్గంలో చిన రాజప్పకు ఎదురుగాలి వీచే లాగానే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: