హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేని జగన్ బొమ్మ కూడా కాపాడలేదా?

తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు కూడా ఒకటి. ఇక్కడ ఎక్కువసార్లు టి‌డి‌పి జెండా ఎగిరింది. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే టి‌డి‌పి అయిదుసార్లు విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ రెండు సార్లు గెలవగా, గత రెండు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.
2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతూ వస్తుంది. రెండుసార్లు తక్కువ మెజారిటీలతోనే వైసీపీ విజయం సాధించింది. ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణచంద్రప్రసాద్  తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఈయనకు ప్లస్ అవుతున్నాయి....ప్రభుత్వం తరుపున జరిగే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు జరిగాయి. అటు నాడు-నేడు ద్వారా ప్రత్తిపాడులో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి.
జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇలా ప్రభుత్వం తరుపున అభివృద్ధి కార్యక్రమాలు తప్ప, ప్రత్తిపాడులో కొత్తగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగడం లేదు. పైగా నియోజకవర్గంలో వైసీపీ నేతలు దందాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే ఇసుక, ఇళ్ల స్థలాల్లో లెక్కలేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. కొండలు, గుట్టలను కరిగించి గ్రావెల్‌ రూపంలో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని టి‌డి‌పి ఇంచార్జ్ వరుపుల రాజా ఆరోపిస్తున్నారు.
అక్రమ మైనింగ్‌లు, అటవీ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి రహదారి ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇలా ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ రోడ్ల పరిస్తితి మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. వాటిని బాగుచేసే కార్యక్రమాలు కూడా చేయడం లేదు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. అటు టి‌డి‌పి నేత వరుపుల రాజా దూకుడుగా పనిచేస్తున్నారు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పైగా రెండుసార్లు నుంచి టి‌డి‌పి తక్కువ మెజారిటీలతో ఓడిపోతుందనే సానుభూతి ఉంది. దీనికి తోడు నెక్స్ట్ జనసేన గానీ టి‌డి‌పితో కలిస్తే ప్రత్తిపాడులో జగన్ బొమ్మ కూడా ఎమ్మెల్యేని కాపాడలేదని తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: